ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై రూపొందిన ‘మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్.ఎస్. రాజమౌళి’. నెట్ ఫ్లిక్స్ అనేది అమెరికా దేశపు ప్రముఖ ఓటీటీ సంస్థ. అమెరికా ఎంటర్‌టైన్మెంట్ మార్కెట్‌లో దాదాపు 25 శాతం కలిగి, భారతదేశంలో దాదాపు 12 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ కలిగిన నెట్ ఫ్లిక్స్ ఓ తెలుగు దర్శకుడి మీద డాక్యుమెంటరీ విడుదల చేయడం ఇదే తొలిసారి.
దాదాపు గంటా 54 నిమిషాల నిడివితో ప్రముఖ వ్యాఖ్యాత అనుపమా చోప్రా నిర్మించిన డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్.ఎస్. రాజమౌళి’. రాఘవ్ కన్నా, తన్వి దర్శకులు. ‘నేను నా కథకు బానిసను. నా ఆడియన్స్ విషయంలో అత్యాశపరుణ్ణి. నా కథను చూడ్డానికి ఎక్కువమంది ఆడియన్స్ కావాలి’... ఇలా తన అభిలాషను ఈ డాక్యుమెంటరీలో వెలిబుచ్చారు రాజమౌళి. తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడు రాజమౌళి ఓ సంచలనం.
‘స్టూడెంట్ నెం.1’ చిత్రం నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా వరకు దర్శకుడిగా రాజమౌళి ప్రయాణంతో పాటు ప్రముఖుల విశ్లేషణలతో ఉంటుందీ డాక్యుమెంటరీ. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రానా, కీరవాణిలు రాజమౌళితో తమ అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. ‘‘రాజమౌళికి కావాలనుకున్నట్టుగా మనం ఇమిడిపోతే ఆయనే మనలను తనకు తగ్గట్టుగా మలుచుకుంటాడు’’ అని చెప్పారు ఎన్టీఆర్. ‘‘రాజమౌళికి సినిమా అంటే పిచ్చి. సీన్ ఎవరైనా వివరిస్తారు. కాని ఆ సీన్‌లో ముందు ఆయన నటించి తరువాత మనతో చేయిస్తాడు. అందుకే రాజమౌళితో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రభాస్ తెలిపారు.
వీరితో పాటు రాజమౌళి కుటుంబ సభ్యులు ఆయనతో తమ అనుభవాలు పంచుకున్నారు. తన సినిమాలలో హీరోలు ఆయుధాలని, దర్శకుడు ఆయుధాలను వదిలే సాధనం అని రాజమౌళి చెబుతూ... ‘‘తనకు రాముడు కన్నా రావణుడు ఇష్టమని, అందుకే తన చిత్రాలలో ప్రతినాయకుడు ప్రత్యేకంగా కనిపించేలా చూసుకుంటాను’’ అని వివరించారు. చిన్న పిల్లాడు అడుగులు వేసేటప్పుడు తడబడతాడు.
అప్పుడు తల్లిదండ్రులుప్రోత్సహించి మరో రెండు అడుగులు వేయిస్తే కొన్ని రోజులయ్యాక పరిగెడతాడు. ఆ కోవలోనే విజయం కోసం కృషి, పట్టుదల,ప్రోత్సాహంతో ఎంతో సాధన చేయాలి. ఈ విషయాన్ని డాక్యుమెంటరీలో లోతుగా వివరించారు రాజమౌళి. డాక్యుమెంటరీ మొత్తంలో చిన్న లోపం ఏంటంటే తెలుగులో దీనికి డబ్బింగ్ వేరొకరితో చెప్పించడం. అందుకే ఇంగ్లీషులో చూడడం శ్రేయస్కరం.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment