సాక్షి, హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్ చిత్రపరిశ్రమ మీద గట్టిగానే పడింది. మొదటి లాక్‌డౌన్ తర్వాత 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకున్న థియేటర్లపై కోవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో థియేటర్ల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. కోవిడ్ దెబ్బకు థియేటర్లు మరోసారి మూతపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంతేకాకుండా టికెట్ల ధరలు పెంచాలన్న ఆలోచన కూడా చేస్తోంది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా నేడు (జూలై 27న) న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు.. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి నిబంధనలు రూపొందించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించాడు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు తెలిపాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈమేరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోం శాఖ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment