వరుసగా సెలవులు వస్తే సినిమాలకు పండగే పండగ. ఆగస్ట్ రెండో వారం అలాంటి పండగే కానుంది. ఆగస్ట్ 15 గురువారం... స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి గవర్నమెంట్ హాలిడే. ఆ రోజుతో పాటు శుక్ర, శని, ఆదివారాల వసూళ్లు రాబట్టుకోవచ్చు. సోమవారం రక్షా బంధన్... అది కూడా కలిసొస్తుంది. అందుకే పంద్రాగస్ట్ టార్గెట్‌గా థియేటర్స్‌లో గెలుపు జెండా ఎగురవేయడానికి కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఆ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.
మిస్టర్ బచ్చన్ రెడీ
రవితేజ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14 లేదా 15న థియేటర్స్‌లోకి రానుందని సమాచారం.
కేజీఎఫ్ కథ
కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. 18వ శతాబ్దం నేపథ్యంలో పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదు. అలా వాయిదా పడి ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. కేజీఎఫ్‌లోని బంగారం కోసం జరిగే అక్రమ తవ్వకాలకు, అక్కడి ఓ గిరిజన తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఇందులో ఆ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపిస్తారు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆగస్ట్ 15నే రిలీజ్ కానుంది.
డబుల్ ఎనర్జీ
పంద్రాగస్ట్‌కు థియేటర్స్‌లోకి వచ్చేందుకు డబుల్ ఎనర్జీతో రెడీ అయ్యాడు ‘డబుల్ ఇస్మార్ట్’. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. సీక్వెల్‌లో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రధారులు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఓ సీబీఐ ఆఫీసర్ మెమొరీని ఓ సైన్స్ చిప్ సాయంతో కిరాయి హంతకుడు శంకర్ (రామ్) మొదడులోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత శంకర్ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అనే కోణంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కథ సాగిన విషయం తెలిసిందే. ఈ కథకు కొనసాగింపుగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.
చిన్న కథ కాదు
‘అమ్మ టెన్త్ ఫెయిల్... కొడుకు ఫిఫ్త్ ఫెయిల్... చిన్న కథ కాదు..’ అనే డైలాగ్ ‘35: చిన్న కథ కాదు’ సినిమాలోనిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఇది. నంద కిశోర్ ఈమాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రసాద్ (విశ్వతేజ్), సరస్వతి (నివేదా థామస్) భార్యాభర్తలు. వీరి కొడుక్కి 35 పాస్ మార్కులు కూడా రావు. దీంతో వాళ్ల కుటుంబం కాస్త నిరాశకు లోనవుతుంది. నిజంగా... 35 పాస్ మార్కులు ముఖ్యమా? ఆ ఊర్లోని మాస్టర్ (ప్రియదర్శి) వల్ల సరస్వతి కొడుకు పడిన ఇబ్బందులు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
స్ఫూర్తిదాయక పోరాటం కీర్తీ సురేష్ నటించిన ఉమెన్
సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. తన గ్రామం కోసం కయల్‌విళి అనే ఓ యువతి చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సుమన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బేనర్ నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై మరో అప్‌డేట్ రాలేదు. మరి.. ఆగస్టు 15 బరిలో కీర్తీ సురేష్ ‘రఘుతాత’ సినిమా ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.
మేం ఫ్రెండ్సండి....
మేం ఫ్రెండ్సండి అంటూ థియేటర్స్‌లోకి వస్తున్నారు కార్తీక్, సబ్బు, హరి. మరి... వీళ్ల కథ ఏంటి? అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో తెలియనుంది. ఈ చిత్రంలో కార్తీక్‌గా నార్నే నితిన్, అతని ప్రేయసి పల్లవి పాత్రలో నయన్ సారిక, సుబ్బుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, హరిగా అంకిత్ నటించారు. ప్రేమ, స్నేహం అంశాల మేళవింపుతో అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
పుష్ప వాయిదా పడటంవల్లేనా?
‘పుష్ప’ ఫ్రాంచైజీలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప: ది రూల్’ సినిమా రానుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడాలనుకోవడం లేదని, అందుకే విడుదలను వాయిదా వేశామని యూనిట్ పేర్కొంది. ఆ తర్వాత ‘పుష్ప: ది రూల్’ను డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 15కి ‘పుష్ప’ రాకపోవడంవల్ల, లాంగ్ వీకెండ్, రక్షాబంధన్ ఫెస్టివల్ కూడా కలిసొచ్చి తమ సినిమాలకు లాభాలు వస్తాయని ఆయా చిత్రయూనిట్‌లు ఆలోచన చేసి ఆగస్టు 15ను టార్గెట్‌గా చేసుకుని ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15కి ఇంకా సమయం ఉంది. సో... ఈ విడుదల జాబితా ఇంకా పెరిగే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment