Wild Dog Movie Review, Rating, in Telugu | వైల్డ్‌ డాగ్‌ మూవీ రివ్యూ | Nagarjuna Akkineni - Sakshi
Sakshi News home page

Wild Dog Movie Review: విజయ్‌ వర్మ ఇన్వెస్టిగేషన్‌ అదిరింది‌

Published Fri, Apr 2 2021 12:33 PM | Last Updated on Sat, Apr 3 2021 9:45 AM

Nagarjuna Wild Dog Movie Review and Rating - Sakshi

టైటిల్‌ : వైల్డ్‌డాగ్
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా తదితురులు  
నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ట్స్ 
నిర్మాతలు : నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి
దర్శకత్వం : అహిషోర్‌ సాల్మన్‌ 
సంగీతం : తమన్‌
సినిమాటోగ్రఫీ : షానిల్ డియో
విడుదల తేది : ఏప్రిల్‌ 02,2021

వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్‌ నాగార్జున. అందం, ఫిట్‌నెస్‌లో యువ హీరోలకు ధీటుగా కనిపిస్తుంటాడీ స్టార్‌ హీరో. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచే ప్రయోగాలు చేస్తున్న నాగ్‌.. 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న కథా చిత్రాలను చేశాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తన పంథాలో దూసుకెళ్తున్నాడు. 

ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న ఈ అక్కినేని హీరో..  ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ ​సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్‌ 02)విడుదలైన ఈ సినిమా నాగార్జునను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? కింగ్‌ నాగార్జున చేసిన మరో ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్ విజయాన్ని అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం.

కథ
విజయ్‌ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఆయన మాత్రం ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమమని భావిస్తాడు. అందుకే డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ను అంతా ‘వైల్డ్‌ డాగ్‌’ అని పిలుస్తుంటారు. అలా అనేకమంది తీవ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసి సస్పెండ్‌ అవుతాడు విజయ్‌ వర్మ. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్‌ బేకరిలో బాంబు బ్లాస్ట్‌ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. కేసును త్వరగా చేధించాలని భావించిన డీఐజీ మోహన్‌ (అతుల్‌ కులకర్ణి).. సస్పెండ్‌ అయిన ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మను తిరిగి విధుల్లోకి చేరాలని కోరతాడు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకోవడంతో కేసును టేకప్‌ చేస్తాడు.

తన టీమ్‌తో కలిసి విజయ్‌వర్మ బాంబు బ్లాస్ట్‌ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిత్‌ చేశాడని కనిపెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్‌ను మళ్లీ సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్‌ని ఎన్‌ఐఏ అధికారులు ఎందుకు సస్పెండ్‌ చేశారు? సస్పెండ్‌ అయినప్పటికీ తన టీమ్‌తో కలిసి ఖాలిత్‌ను ఎలా పట్టుకున్నాడు? విజయ్‌ లీడ్‌ చేస్తున్న ఎన్‌ఐఏ టీమ్‌లో ‘రా’ ఏజెంట్‌ అయిన ఆర్యా పండిట్‌ (సయామీ ఖేర్‌)ఎందుకు జాయిన్‌ కావాల్సి వచ్చింది? చివరకు ఖాలిత్‌ను విజయ్‌ వర్మ ఏం చేశాడు అనేదే మిగతా కథ.


నటీనటులు
ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కింగ్‌ నాగార్జున. ‘వైల్డ్‌డాగ్‌’ మూవీ కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. దేశభక్తి గల ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు నాగ్‌. పోరాట ఘట్టాలను కూడా అవలీలగా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్‌ సీన్‌లో అదరగొట్టాడు. రా ఏజెంట్‌ ఆర్యాపండిత్‌ పాత్రలో సయామీ ఖేర్‌ జీవించేసింది. చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. విజయ్‌ వర్మ టీమ్‌ సభ్యుడిగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీరెజా ఒదిగిపోయాడు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర తనది. విజయ్‌ వర్మ భార్య ప్రియగా దియా మీర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది. అతుల్‌ కులకర్ణి, ప్రకాశ్‌, ప్రదీప్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్‌ హంగులు లేకుండా ఓ సీరియస్‌ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్‌ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్‌ పెడుతూ సినిమా నడించాడు.

ఫస్టాప్‌ ఎక్కువగా ఎమోషనల్‌ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టి పెట్టాడు. సెకండాఫ్‌ అంతా చాలా సీరియస్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్‌ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ నేపథ్య సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండనిపిస్తుంది. యాక్షన్స్‌ సీన్స్‌ని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
నాగార్జున నటన
తమన్‌ నేపథ్య సంగీతం
యాక్షన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌
కమర్షియల్‌ అంశాలు లేకపోవడం
ఫస్టాఫ్‌
-అంజి శెట్టె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement