నానా పటేకర్, మనీషా
నానా పాటేకర్ నటనే కాదు జీవితమూ వైవిధ్యమే! నటుడిగా విజయాలే ఎక్కువ. భర్తగా, ప్రేమికుడిగా వైఫ్యలాలు ఎక్కువ! మనీషా కోయిరాలా కూడా వెర్సటైల్ నటే. ఆమెకూ జీవితంలో పోరాటం తప్పలేదు. స్వభావ రీత్యా ఇద్దరూ ఒకటే. కోపం, ఆవేశం విషయంలో ఇద్దరిదీ ఒకే మీటర్. ప్రేమ విషయంలోనూ ఆ మీటర్ తప్పలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కానీ.. దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఇద్దరూ తప్పారు.
వివరాలు..
1996లో వచ్చిన అగ్నిసాక్షి.. నానా, మనీషా కలసి చేసిన మొదటి సినిమా. ఆ సెట్స్ మీదే వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. తనలాగే ఉండే మనీషా ముక్కుసూటి వ్యవహారం అతనికి నచ్చింది. ఆమె మీద ప్రేమా కలిగింది. అంతకుముందే వివేక్ ముష్రాన్‌తో బ్రేకప్ అయిన బాధలో ఉన్న మనీషాకు నానా స్నేహం, చూపిస్తున్న ప్రేమ ఊరటనిచ్చాయి. దాంతో తనూ నానా పట్ల ప్రేమను పెంచుకుంది. అదే యేడు వచ్చిన ఖామోషీ (ఇందులో తండ్రీ, కూతురిగా నటించారు)తో ఆ ఇద్దరి మధ్య అనుబంధం బలపడ్డమే కాదు ఆ రహస్యం చిత్రపరిశ్రమకూ తెలిసిపోయింది. ఆ ప్రేమను పెళ్లిగా మలచుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు నానా పాటేకర్. మనీషా ‘నో’ చెప్పలేదు కాని అప్పటికే పెళ్లయి ఉన్న నానాతో ‘నీ భార్యకు విడాకులివ్వు’ అంది. మౌనంతో ఆ సందర్భాన్నుంచి బయటపడ్డాడు అతను.
నిజానికి నానా పాటేకర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌నేమీ ఆస్వాదించట్లేదు. అతని భార్య నీలకాంతి. మరాఠీ నటి, దర్శకురాలు, నిర్మాత. మంచి శిల్పి కూడా. పెళ్లయిన ఏ కొంత కాలమో సంతోషంగా ఉన్నారు ఆ భార్య, భర్త. తర్వాత నుంచి విభేదాల ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారింది వాళ్ల దాంపత్యం. ఇద్దరు పిల్లలూ పుట్టడంతో వాళ్ల ముందు కీచులాడుకోవడం, పోట్లాడుకోవడం ఇష్టం లేక విడాకులు తీసుకోకుండానే విడి విడిగా ఉండడం ప్రారంభించారు.
ఆయేషా, నీలకాంతి
విడాకులు, పెళ్లి గురించిన వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి మనీషా, నానా మధ్య. ఇంకోవైపు ఆమె మీద పొసెసివ్‌నెస్ ఎంతలా పెరిగిందంటే మనీషా ప్రవర్తనకు హద్దులు పెట్టేంతగా. ఆమె కాస్త ఆధునికంగా అలంకరించుకున్నా నానా అభ్యంతరపెట్టేవాడు. సహ నటులతో కొంచెం చనువుగా మాట్లాడినా ఆమె మీద నోటి దురుసుతనం ప్రదర్శించేవాడు. పెళ్లితో ఆ అభద్రతకు చెక్ పెట్టొచ్చని ఆశపడింది మనీషా. అందుకే నీలకాంతితో విడాకుల కోసం ఒత్తిడి తెచ్చింది. ‘ఇవ్వను. నీతో కలసి ఉండడానికి సిద్ధమే.. కాని నీలకాంతికి విడాకులు ఇచ్చేసి కాదు’ అని స్పష్టం చేశాడు నానా పాటేకర్. నివ్వెరపోయింది మనీషా. అప్పటి నుంచి ఆమెలో అభద్రత మొదలైంది.
ఈలోపు..
నానా పాటేకర్.. ఆయేషా జుల్కాతో దగ్గరగా ఉంటున్నాడన్న విషయం పరిశ్రమలో గుప్పుమంది. పత్రికల్లోనూ అచ్చయింది. మనీషా మెదడులోనూ పడింది. ఒకసారి మనీషా నానా పాటేకర్‌ను కలవడానికి వెళ్లేసరికి ఆయేషా జుల్కా అక్కడే ఉంది. స్నేహం కంటే ఎక్కువ దగ్గరితనం వాళ్ల మధ్య కనపడేసరికి కోపావేశాలకు లోనైన మనీషా ఇంగితం మరచిపోయి ఆయేషా జుల్కాను తిట్టేసింది. నానా పాటేకర్ జోక్యంతో అక్కడికి, అప్పటికి సద్దుమణిగినా ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసింది. ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ దూరం నెమ్మది నెమ్మదిగా వాళ్ల మధ్య అనుబంధాన్ని, బంధాన్నే తెంచేసింది.
నానా పాటేకర్, మనీషాల ప్రేమ కథ బ్రేకప్‌తో ఎండ్ అయిపోయింది.
నానా పాటేకర్, ఆయేషా జుల్కా కలసి ఉండడం ప్రారంభించినా, మనీషా ముందుకు సాగిపోయినా విడిపోవడం ఆ రెండు మనసులనూ వేధించింది. ‘బ్రేకప్ అనేది డిఫికల్ట్ ఫేజ్. అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది ఆ బాధేంటో. మనీషా కస్తూరి మృగం లాంటిది. చాలా సున్నిత మనస్కురాలు. ఆమె నన్ను వదిలి వెళ్తుంటే అతికష్టమ్మీద కన్నీళ్లను దిగమింగా. ఐ మిస్ మనీషా’ అని చెప్పాడు నానా పాటేకర్ ఒక ఇంటర్వ్యూలో.
2010లో మనీషా .. నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్‌ను పెళ్లిచేసుకుంది. కాని రెండేళ్లకే ఆ పెళ్లి విఫలమైంది. తర్వాత ఆమె క్యాన్సర్ బారినపడింది. ఆ పోరాటంలో గెలిచి.. మళ్లీ సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
-ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment