దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమను మరో మెట్టుకు ఎక్కించిన ఈ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అత్యంత్ర ప్రతిష్టాత్మకమై ఈ అవార్డు రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతుండాలో ఓసారి చూద్దాం.. ఈ ఆస్కార్ అవార్డు కోసం సినిమా ఎదురుకాబోయే చాలా పరీక్షల్లో అర్హత సంపాదించడం అత్యంత ముఖ్యమైంది.
ఏ సినిమా అయిన ఆస్కార్ బరిలో ఉండాలంటే.. అది అమెరికాలో గుర్తింపు పొందిన ఆరు ప్రధాన నగరాల్లోని ఏదో ఒక సిటీలో కమర్షియల్ థియేటర్‌లో రిలీజ్ అవ్వాలి. అంతేకాదు.. కనీసం వారం రోజుల పాటు అక్కడ సినిమా ఆడాలి. రోజుకు కనీసంగా మూడు ఆటల చొప్పున సాయంత్రం షో తప్పకుండా ఉండాలి. ఆస్కార్ అప్లికేషన్ ఫామ్‌లో సినిమా ప్రదర్శించబడినట్లు రిసీట్ కూడా జతచేయాలి. అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరికి ఈ అర్హత అవసరం లేదు.
ప్రస్తుత ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా సినిమాలు ఈ అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇండియా నుంచి ఆర్‌ఆర్‌ఆర్, కాంతార, గంగూభాయ్, ది కశ్మీర్ ఫైల్స్, మి వసంత్రావ్, రాకేట్రీ లాంటి పలు సినిమాలు అర్హత సాధించాయి. వీటన్నింటిని రిమైండర్ లిస్టుగా పిలుస్తారు. ఇలా రిమైండర్ లిస్టులో ఉన్న సినిమాలన్ని క్యాటగిరీలకు అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. అయితే ఈ సినిమాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరి కింద గుర్తించబడవు.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్‌ఫిల్మ్ క్యాటగిరి...
ఈ కేటగిరి కోసం ప్రతీ ఒక్క దేశం తమ తరుపున ఒక్క సినిమాను ఆస్కార్ ఎంట్రీ కోసం నామినేట్ చేస్తుంది. ఈసారి దాదాపు 80 దేశాలు ఈ క్యాటగిరి కింద ఒక్కో సినిమాను నామినేట్ చేశాయి. భారత్ తరుపున ఈసారి ఛెల్లో సినిమాను నామినేట్ చేశారు. ఇప్పటికే దాదాపు 10 కేటగిరీలకు సంబంధించిన షార్ట్‌లిస్ట్‌ను డిసెంబర్-21న ప్రకటించింది ఆస్కార్ అకాడమీ. ఇందులో
1. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్-15 సినిమాలు
2. షార్ట్ డాక్యుమెంటరీ-15 సినిమాలు
3. ఇంటర్నేషనల్ ఫీచర్-15 సినిమాలు
4. మేకప్ అండ్ హేయిర్ స్టైల్-10 సినిమాలు
5. మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్- 5 సినిమాలు
6. మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్-15 సినిమాలు
7. షార్ట్ యానేటెడ్ ఫిల్మ్-15 సినిమాలు
8. లైవ్ యాక్షన్-15 సినిమాలు
9. సౌండ్-10 సినిమాలు
10. వీఎఫ్‌ఎక్స్-10 సినిమాలు
ఈ కేటగిరీల్లో ఇండియా నుంచి నాలుగు సినిమాలు ఆస్కార్ అకాడమీ ప్రకటించిన షార్ట్‌లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి.
ఇందులో
1. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు గాను RRR సినిమా షార్ట్ లిస్టు అయ్యింది.
2. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఛెల్లో సినిమా షార్ట్ లిస్టు అయింది.
3. షార్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో... ఆల్ దట్ బ్రీత్ సినిమాను షార్ట్ లిస్టు చేశారు.
4. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎలిఫెంట్ విస్ఫర్స్ నామినేట్ అయింది.
జనవరి 24న అన్ని కేటగిరీలకు సంబంధించి 5 సినిమాలను అకాడమీ షార్ట్ లిస్టు విడుదల చేయనుంది. ఇక ఒకసారి ఫైనల్ నామినేషన్స్ పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్కార్ అకాడమీ మెంబర్స్ ఓటింగ్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అకడామీలో దాదాపు 10 వేల మంది సభ్యులున్నారు. వీరిలో చాలామంది అమెరికాకు చెందినవారే... అయితే ఇందులో ఇండియాకు చెందిన 40మంది ఉన్నారు. అకాడమీకి చెందిన 10వేల మంది సభ్యులు దాదాపు 16 క్రాఫ్ట్‌లకు చెందిన వారై ఉంటారు.
వీరి ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్ ఇలా చాలా విభాగాలకు సంబంధించినవారు. వీరు ముందుగా అర్హత సాధించిన 300 సినిమాలను వివిధ కేటగిరీలకు నామినేట్ చేసే ప్రక్రియలో ఓటింగ్ చేస్తారు. చివరికి షార్ట్ లిస్టు అయిన సినిమాలకు వీరు వేసే ఓటే డిసైండింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. వీరిలో చాలామంది అమెరికాకు చెందిన వారు కావడంతో వీరంతా అమెరికాలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలకు ఓటు వేస్తారనే చర్చ ఉంది. అందుకే సినిమా ప్రమోషన్ చాలా ముఖ్యమైంది. ఇప్పటికే నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో... RRR సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.
అమెరికాలో సైతం చాలామంది RRR సినిమాను ప్రశంసించారు. సినిమా దేవుడిగా పిలిచే స్టీఫెన్ స్పీల్‌బర్గ్ సైతం తనకు నాటు నాటు పాట బాగా నచ్చిందని చెప్పారు. అందుకే ఈసారి RRR సినిమాకు ఆస్కార్ పక్కా అనే చర్చ జరుగుతోంది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతే కాకుండా షార్ట్ లిస్ట్ చేయకుండానే కొన్ని బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ లాంటి కేటగిరీలకు డైరెక్ట్‌గా నామినేషన్స్ చేస్తారు. ఇలాంటి కేటగిరీల్లోనూ RRR సినిమాకు ఛాన్స్ ఉందని అంటున్నారు.
--ఇస్మాయిల్, ఇన్ పుట్ఎడిటర్, సాక్షి టీవీ
Comments
Please login to add a commentAdd a comment