
బిగ్‌బాస్ రియాలిటీ షో చరిత్రలో తొలిసారి ఓ రైతుబిడ్డ హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడికి సోషల్ మీడియా అకౌంట్ ఉండి బోలెడంత ఫ్యాన్‌బేస్ ఉన్నప్పటికీ అందరికీ పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డగానే సుపరిచితం. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ మళ్లొచ్చిన.. అంటూ ఎప్పుడూ రైతు పడే కష్టాలే చెప్తుంటాడు. అందుకే బిగ్‌బాస్ 7 లాంచ్ రోజు బియ్యం బస్తా పట్టుకెళ్లి నాగార్జునకు బహుమతిగా ఇచ్చి అసలు సిసలైన రైతుబిడ్డ అని నిరూపించుకున్నాడు.
రైతుబిడ్డకు నిజంగా అంత ఆస్తి ఉందా?
అయితే బిగ్‌బాస్ ఇంట్లో పదేపదే తాను రైతుబిడ్డ అని చెప్పుకోవడం అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్లకు అస్సలు నచ్చలేదు. దీంతో అతడిని విమర్శిస్తూ అతడి ఆటకు, మాటలకు అడ్డం పడుతున్నారు. హౌస్‌లో పరిస్థితి ఇలా ఉంటే బయట మరో కొత్తరకమైన గొడవ మొదలైంది. ప్రశాంత్ పేదవాడేమీ కాదు, అతడికి 26 ఎకరాల భూమి, నాలుగు ఖరీదైన కార్లు, కోట్ల ఆస్తి ఉందంటూ కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ ప్రచారంపై పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించాడు.
26 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి
ఆయన మాట్లాడుతూ.. 'మా గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారు. 26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవంతి ఉన్నాయంటున్నారు. నిజంగా అవన్నీ ఉంటే నా కొడుకు బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తాడు? నాలుగు కార్లు ఉంటే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు. అసలు 26 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి. నాకున్నదల్లా ఆరెకరాల పొలం మాత్రమే! దాన్ని పంచితే ప్రశాంత్‌కు రెండెకరాలు వస్తాయంతే!
రైతులకు ఇస్తే అదే సంతోషం..
రైతులను ఎప్పుడూ చిన్నచూపే చూస్తారు, కానీ పెద్ద చూపు చూడరు. బిగ్‌బాస్ ఇంట్లో నా కొడుకుని చులకన చేస్తూ మాట్లాడుతుంటే బాధేసింది. ఒకవేళ నా కొడుకు బిగ్‌బాస్ గెలిస్తే వాడు చెప్పినట్లుగా ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకోటి ఉండదు. పొలాన్ని నమ్ముకున్న ఎంతోమంది రైతులు మా కళ్లముందే ప్రాణాలు విడిచారు. వారు పడే కష్టాలు ఏంటో.. కళ్లారా చూసిన మాకు మాత్రమే తెలుసు' అని గద్గద స్వరంతో మాట్లాడాడు ప్రశాంత్ తండ్రి.
Comments
Please login to add a commentAdd a comment