
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార తాజాగా తన తండ్రి కురియన్ కొడియట్టు పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తన చిన్ననాటి ఫోటోను ఆమె షేర్ చేశారు. అందులో చిన్న వయసులో ఉన్న నయనతారను ఎత్తుకుని కురియన్ ఆడిస్తున్న సందర్భంలో క్లిక్‌మనిపించిన ఫోటోలా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
తన తండ్రి జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు నయనతారా కేరళ వెళ్లింది. అక్కడ తన బంధువులతో కలిసి దిగిన ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా రాసుకొచ్చింది. 'నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మై ఫరెవర్ లవ్.. ఐ లవ్యూ అచ్చా(నాన్న) అని నయనతార రాసుకొచ్చింది. ఆపై 'హ్యాపీ బర్త్‌డే డాడ్, మిస్టర్ కురియన్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఆపై తన తండ్రి గురించి నయన్ ఇలా చెప్పింది. 'నేను, మా నాన్న, అమ్మ అందరం కలిసి కూర్చోని మాట్లాడుకోవడం చాలా అరుదు. నేను కుటుంబం- పని రెండింటినీ వేరుగా ఉంచేందుకు ఎక్కువగా ఇష్టపడుతాను. పనిలో రాజీపడకపోవడం, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం, క్రమశిక్షణ... ఇవన్నీ నాకు మా నాన్న కురియన్ నుంచే వచ్చాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నను హీరోగానే చూశాను. మా నాన్న నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. కష్ట సమయంలో ఎలా నిలబడాలో నాన్న నుంచే తెలుసుకున్నాను.' అని తెలిపారు.
నయన్ తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అని తెలుసా?
నయనతార తండ్రి కురియన్ కొడియట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా పనిచేశారు. గత ఐదేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. తనకు కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం వస్తే గనుక.. తన తండ్రిని పూర్తి ఆరోగ్యవంతుడిలా మార్చేయాలని కోరుకుంటానని ఆమె చెప్పింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం తన తండ్రే అని నయనతార చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment