తెలుగు స్టార్ హీరోలు 'పాన్ ఇండియా' జపం చేస్తున్నారు. ప్రభాస్ నుంచి నిఖిల్ వరకు ఈ ప్రయత్నాల‍్లో ఫుల్ బిజీ బిజీ. ఈ తరహా సినిమాలు చేస్తున్నారు గానీ హిట్స్ మాత్రం చాలా తక్కువ. మరోవైపు పాన్ ఇండియా సినిమాలు నెలకు ఒకటి రావడమే గగనమైపోయిన ఈ రోజుల్లో.. ఏకంగా ఓ నెలంతా అలాంటి చిత్రాలే వస్తే? బాక్సాఫీస్ కి బ్యాండ్, మూవీ లవర్స్ కి పండగ గ్యారంటీ.
మీకు సినిమాలంటే బాగా పిచ్చి ఉండి, ఓ మంచి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం సెప్టెంబరు వరకు ఆగండి. ఎందుకంటే పాన్ ఇండియాతోపాటు సరైన మాస్ చిత్రాలన్నీ అదే నెలలో విడుదలకు సిద్ధమైపోతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా వారానికొకటి చొప్పున నాలుగుకి పైనే బరిలో ఉన్నాయి. వీటితోపాటు తెలుగు సినిమా ఒకటి, డబ్బింగ్ మూవీ మరొకటి లైన్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూసేద్దాం.
(ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?)
ప్రభాస్ ఊరమాస్!
'బాహుబలి' తర‍్వాత అలాంటి హిట్ ఎప్పుడు పడుతుందా? రచ్చ ఎప్పుడు చేద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిటింగ్. అయితే దీని తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు వందల కోట్లు సాధించాయి గానీ హిట్ కొట్టలేకపోయాయి. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తీస్తున్న ఊరమాస్ మూవీ 'సలార్'పైనే. సెప్టెంబరు 28న ఇది రిలీజ్ కానుంది. ఇది హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవడం, సరికొత్తవి నమోదు కావడం పక్కా.
రౌడీ హీరో ఈసారైనా?
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా వైడ్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేది ఈ సెప్టెంబరులోనే. అదే నెల 1వ తేదీన 'ఖుషి' చిత్రం రిలీజ్ కానుంది. ఇది హిట్ కావడం విజయ్ కి చాలా ముఖ్యం. ఎందుకంటే 'లైగర్'తో ఇండస్ట్రీని దున‍్నేస్తా అదీఇదీ అని గతేడాది ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. కట్ చేస్తే ఆ మూవీ బొక్కాబోర్లా పడింది. ఇప్పుడు హిట్ కొడితే ఓకే లేదంటే మాత్రం విజయ్ కి కష్టాలు తప్పవు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)
షారుక్ కొట్టాల్సిందే!
2018లో 'జీరో' ఫ్లాప్ కావడంతో షారుక్ పునరాలోచనలో పడిపోయాడు. దాదాపు ఐదేళ్లపాటు బిగ్ స్క్రీన్ కి దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో 'పఠాన్'తో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాద్ షాలో పస తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే మరో హిట్ కచ్చితంగా కావాలి. ఇప్పుడది 'జవాన్'తో వచ్చేలా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని దేశభక్తి ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తీశారు. సెప్టెంబరు 7న రానున్న ఈ చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు సునామీ గ్యారంటీ.
రామ్ ఈసారి మాత్రం!
రామ్ పేరు చెప్పగానే అందరికీ 'ఇస్మార్ట్ శంకర్' గుర్తొస్తుంది. దీని తర్వాత రెడ్, ద వారియర్ చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయాయి. దీంతో ఒకేసారి హిట్ కొట్టడంతో పాటు పాన్ ఇండియా లెవల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాని ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తీస్తున్నారు. దసరాకు విడుదల చేయాలనుకున్నారు గానీ ఇప్పుడు దాని విడుదల తేదీ మార‍్చారు. సెప్టెంబరు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
ఈ సినిమాలు కూడా!
ఇలా పైన చెప్పినట్లు సెప్టెంబరులోని నాలుగు వారాల్లో నాలుగు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు 'డీజే టిల్లు 2' మూవీ సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న 'చంద్రముఖి 2' కూడా ఇదే నెలలో వచ్చే అవకాశముందని అంటున్నారు. డేట్ ఫిక్స్ అయితే గానీ క్లారిటీ రాదు. సో అదనమాట విషయం. సెప్టెంబరు రావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. కాబట్టి దొరికిన ఈ టైంలో హైప్ పెంచుకోండి. ఎందుకైనా మంచిది ఏ మూవీకి వెళ్లి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడే ఓ ప్లాన్ రెడీ చేసి పెట్టుకోండి!
(ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment