సినిమా అంటే వినోదం. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంతైనా కష్టపడతారు సినిమా స్టార్స్. రాజకీయాలు అంటే సేవ. అలా సేవ చేసేవాళ్లనే జనాలు ఏరి కోరి ఎన్నుకుంటారు. పవన్ కల్యాణ్ దృష్టిలో కూడా సినిమా అంటే వినోదమే, కానీ రాజకీయాలంటేనే టైం పాస్. సినిమా ప్రమోషన్స్ చేసుకునే ఒక వేదిక! జనసేన అంటూ రాజకీయాల్లోకి దిగిన తరువాత పవన్ కల్యాణ్ తన ప్రతి సినిమాను రాజకీయ వేదికగా ప్రమోషన్ చేసుకుంటున్నాడు. అసలు సినిమాలే చేయనని చెప్పిన ఈయన వరుసగా సినిమాలు చేసే తీరు చూస్తుంటే తన సినిమా ప్రమోషన్ కోసమే ఒక రాజకీయవేదికను ఏర్పాటు చేసుకున్నాడా? అనే అనుమానం కలగకమానదు. అందుకు గల కారణాలేంటో అతడు నటించిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది.
దొంగ ఏడుపులతో సినిమా ప్రమోషన్
2016 ఏప్రిల్‌లో సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందు సినీ విమర్శకురాలు అనుపమా చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు పవన్. అప్పుడు అతడు మాట్లాడుతూ.. మరో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నాయని అవి పూర్తిచేసుకుని ఇక సినిమా రంగాన్ని వదిలేస్తానని చెప్పాడు. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకు నెల గడవటానికే కష్టంగా ఉంది.. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నానంటూ బీద అరుపులు అరిచి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.
అదీ లేదు, ఇదీ లేదు
2017లో కాటమరాయుడు సినిమా రిలీజ్‌కు ముందు ఎన్నో కారుకూతలు కూశాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం అదే ఏడాది మార్చిలో వైజాగ్ బీచ్‌లో దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ నిరసన చేస్తానని ప్రకటించాడు. సినిమా రిలీజై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ నిరసన ఊసే లేదు. ఇక సినిమా రిలీజయ్యాక అదే ఏడాది మార్చి చివర్లో అగ్రిగోల్డ్ బాధితులను కలుస్తాను అనే పేరున విజయవాడ వచ్చి ఒకరోజు షో చేసి వెళ్ళిపొయాడు.
అర్థం పర్థం లేని వాగుడు
2018 జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజైంది. ఈ సినిమా విడుదల కావడానికి నెల ముందే ప్రమోషన్ మొదలు పెట్టాడు పవన్. 2017 డిసెంబర్‌లో మూడు రోజుల యాత్ర అని యధావిదిగా సీఎం జగన్ గారిని దూషిస్తూ, చంద్రబాబును పొగుడుతూ, కులం, మతం అని అర్థంపర్థం లేని మాటలు మాట్లాడాడు. ప్రజారాజ్యాన్ని మోసం చేసిన వాళ్ళను ఎవ్వరినీ వదలనని డైలాగ్స్ కొట్టి ప్రమోషన్ చేసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన 13 రోజులకు ఖమ్మంలో మీటింగ్ పెట్టి పిచ్చి డైలాగ్స్ కొట్టి సినిమాను మరోసారి ప్రమోషన్ చేసుకున్నాడు.
పేరుకే రాజకీయ సభ.. కానీ సినిమా డైలాగ్స్
2021 ఏప్రిల్ 9న వకీల్ సాబ్ రిలీజైంది. ఎప్పటిలాగే రాజకీయాలను కూడా సినిమా ప్రమోషన్స్‌కే వాడుకున్నాడు. రైతుల పేరుతో రాజకీయ ముసుగు వేసి "మీ నాయకుడికి చెప్పండి వకీల్ సాబ్ వస్తున్నాడని" లాంటి డైలాగ్స్‌తో సినిమా ప్రమోషన్ చేసుకున్నాడు. తరువాత తిరుపతి ఉపఎన్నికల సభను సైతం వదలకుండా దాన్ని కూడా సినిమా ప్రమోషన్‌కు వాడుకున్నాడు. వకీల్ సాబ్ విడుదలకు వారం రోజుల ముందు తిరుపతిలో ఉపఎన్నిక సభ పెట్టి సినిమా డైలాగ్స్ కొట్టించుకుని ప్రమోషన్ చేసుకున్నాడు. సినిమా రిలీజ్ తరువాత బీజేపీ నేత సునీల్ ధియోధర్ లాంటి వాళ్ళ చేత కూడా సినిమా ప్రమోషన్ చేయించుకున్నాడు.
ఒకరిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ పని
2022 ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ రిలీజైంది. దీనికంటే ముందు ఫిబ్రవరి 20న నర్సాపురంలో మత్స్యకార అభ్యునతి అనే పేరుపెట్టి ఒక సభకి ప్లాన్ చేశాడు. ఎప్పటిలాగే తెలుగు దేశం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం సీఎం జగన్ ప్రభుత్వంపై నిరాధారమైన నిందలు మోపి అసత్యాలు ప్రచారం చేసి వెళ్ళిపోయాడు. సినిమాల మీద ఇష్టముంటే అక్కడే ఉండాలి కానీ ఇలా రాజకీయాలను సినిమా కోసం వాడుకోవడమేంటో అర్థం కాక తల పట్టుకుంటున్నారు ప్రేక్షకులు.
అయినా సరే తను నడిచే అడ్డదారినే అసలైన రహదారి అంటూ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడు పవన్. ఇప్పటిదాకా చేసింది చాలదన్నట్లు ఇప్పుడు కూడా.. బ్రో, భవదీయుడు భగత్ సింగ్, ఓజీ, హరిహరవీరమల్లు సినిమాల ప్రమోషన్ కోసం తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో వారాహి పేరిట రాజకీయ యాత్ర మొదలుపెడుతున్నాడు. ఇతడి వ్యవహారం చూసి ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment