కరోనా సమయంలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఓటీటీలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సినిమా 'మా ఊరి పొలిమేర'. దీంతో దీని సీక్వెల్ 'పొలిమేర-2'ను భారీ స్థాయిలో తెరకెక్కించారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. నవంబర్ 3న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుని విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించగా.. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
పొలిమేర-2 చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలని చాలా మంది డైరెక్టర్లకు కోరిక ఉంటుంది. ఆ అవకాశం వస్తే అదొక పెద్ద అచీవ్‌మెంట్ అని చెప్పవచ్చు.. కానీ ఆ ఇంటర్వ్యూలో అనిల్ విశ్వనాథ్‌కు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఛాన్స్ వస్తే చిరంజీవితో సినిమా చేస్తారా? అని. అందుకు ఆయన ఇలా చెప్పుకొచ్చాడు..
మెగాస్టార్‌తో సినిమా నా వల్ల కాదు
'నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని.. నన్ను మించిన అభిమాని ఆయనకు మరోకరు ఉండరేమో.. ఆయనంటే నాకు చెప్పలేనంత అభిమానం. నేను డైరెక్ట్ చేసిన సినిమాను చిరంజీవి గారు చూసి.. బాగుంది అని నన్ను అభినందిస్తే చాలు.. ఆ మాటతోనే సినిమాలు తీయడం ఆపేస్తాను. అదొక నాకు అచీవ్‌మెంట్. నాకు ఈ గౌరవం దక్కితే చాలు. ఏ అవార్డులు, రివార్డులు వద్దు. భవిష్యత్‌లో పొలిమేరకు మించిన సినిమా తప్పకుండా తీస్తాను. అప్పుడు నన్ను చిరంజీవి గారు గ్యారెంటీగా పిలిపించుకుని అభినందిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది.
కానీ మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే.. నేను రిజెక్ట్ చేస్తాను. ఎందుకంటే..? డైరెక్టర్ అనేవాడు షూటింగ్ సమయంలో ఏదీ బాగుందో..? లేదో.. ? చెప్పాలి. కానీ చిరంజీవి గారి విషయంలో ఏది చేసినా నాకు నచ్చుతుంది. అలాంటప్పుడు కెమెరా ముందు ఆయన యాక్టింగ్‌ని చూసి నేను జడ్జ్ చేయలేను. కాబట్టి ఆయన అవకాశం ఇచ్చినా.. నేను చేయలేనని చెబుతాను. నాకు గ్యాంగ్‌లీడర్ సినిమా అంటే చాలా ఇష్టం.. ఇప్పటి వరకు ఆ సినిమాను 70 సార్లు చూశాను.' అని అనిల్ విశ్వనాథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment