రవీందర్ రెడ్డి, రాధాకృష్ణ, ప్రభాస్, తమన్, జస్టిన్ ప్రభాకరన్
‘‘మిర్చి’, ‘బాహుబలి’ (రెండు భాగాలు), ‘సాహో’ వంటి యాక్షన్ చిత్రాల తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి పీరియాడికల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ చేయడం నాకు వ్యక్తిగతంగా కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో పెద్దగా ఫైట్స్ ఉండవు కానీ యాక్షన్ ఫీల్ ఉంటుంది. విక్రమాదిత్య పాత్రకు మాస్ టచ్ ఉంటుంది’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్ ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘నాలాంటి యాక్టర్‌కు లవ్‌స్టోరీ ఇవ్వడానికి భయపడుతుంటారు. కానీ రాధాకృష్ణ ‘రాధేశ్యామ్’ లాంటి మంచి ప్రేమకథ చెప్పారు. ఈ సినిమా కథ చెప్పడానికి రాధాకృష్ణ వచ్చి.. కథలో హీరో జ్యోతిష్కుడు అన్నారు. ఇలాంటి వాటిపై నాకు పెద్దగా నమ్మకం లేదు. వెంటనే ‘నో’ చెబితే బాగోదని, ఇంట్రవల్ వరకు విని నచ్చలేదని చెబుదామనుకుని ‘రాధేశ్యామ్’ కథ వినడం స్టార్ట్ చేశాను. కానీ కథ వింటున్నంత సేపు ఆసక్తిగా కనిపించింది.
ముఖ్యంగా సెకండాఫ్‌లోని సీన్లు నన్ను ఎగై్జట్ చేశాయి. దీంతో ‘రాధేశ్యామ్’ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. దర్శకుడు రాధాకృష్ణ నాలుగేళ్లుగా ఈ సినిమాకే కమిట్ అయ్యున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ఒక్క షిప్ ఎపిసోడ్ కోసమే దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. ఈ 13 నిమిషాల షిప్ ఎపిసోడ్ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. గోపీకృష్ణా మూవీస్‌లో వచ్చిన ‘కృష్ణవేణి’ చిత్రం పెదనాన్నగారి (నటుడు, నిర్మాత కృష్ణంరాజు) కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచింది. ఈ బ్యానర్‌లో 13 సినిమాలు నిర్మిస్తే దాదాపు 10 సినిమాలు హిట్. దీంతో గోపీకృష్ణా మూవీస్ నుంచి వస్తోన్న చిత్రం అంటే హిట్ సాధించాలనే కోరుకుంటాను. అలాగే ఈ చిత్రానికి నా సిస్టర్ ప్రసీద (కృష్ణంరాజు కుమార్తె) ఓ నిర్మాత.
యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ బాగా హెల్ప్ చేశారు. ఇక పెదనాన్నగారు, నేను చేసిన ‘బిల్లా’ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ చేశాం. ఈ చిత్రంలో పెదనాన్నగారు పరమహంస అనే ఫిలసాఫికల్ పాత్ర చేశారు. ఆయనకు కథ చెప్పడానికి రాధాకృష్ణ మొదట్లో భయపడ్డారు. అయితే పైకి ఆయన అలా ఉంటారు కానీ చాలా కూల్ పర్సన్. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌గారు పర్‌ఫెక్ట్‌గా సెట్స్‌ను డిజైన్ చేశారు. కెమెరామ్యాన్ పరమహంసగారు నాకు, పూజాకు మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్‌ని బాగా చిత్రీకరించారు. ఇక ఈ లవ్‌స్టోరీకి జస్టిన్ ప్రభాకరన్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అలాగే తమన్‌గారి మ్యూజిక్ ‘రాధేశ్యామ్’ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది’’ అన్నారు.
వెయ్యి కోట్ల ట్రీట్: రాధాకృష్ణ
‘‘రాధేశ్యామ్’ జర్నీతో ప్రభాస్‌గారు నా లైఫ్‌లోనే స్వీటెస్ట్ పర్సన్ అయిపోయారు. ఈ చిత్రంలో విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ప్రభాస్, పూజా హెగ్డే మెప్పిస్తారు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విక్రమాదిత్య ఎమోషన్‌ను, ప్రేరణ ఇంటెన్స్‌ను ఆడియన్స్ ఇంటికి తీసుకుని వెళతారు. కృష్ణంరాజుగారు ఈ సినిమాకు ఇచ్చిన సలహాలు, సూచనలు ఉపయోగపడ్డాయి. ఈ సినిమాకు దాదాపు 300 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ వెయ్యికోట్ల విజువల్ ట్రీట్‌ను థియేటర్స్‌లో చూస్తారు.
రిటర్న్ గిఫ్ట్: తమన్
ప్రభాస్ సినిమాతో తొలిసారి అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది. ఇక తెలుగుకు మణిరత్నంగారి వంటి దర్శకుడు రాధాకృష్ణ రూపంలో దొరికాడా? అని నాకు అనిపిస్తోంది. నా కెరీర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్‌వారు నాకు ‘భాగమతి’, ‘మహానుభావుడు’ వంటి సినిమాలను ఇచ్చారు. ఇప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్‌గా ‘రాధేశ్యామ్’ చేశాను.
ఎంత అవసరమో అంతే: రవీందర్
‘‘రాధేశ్యామ్’ను తొలుత ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేయడం జరిగింది. రాధాకృష్ణను నమ్మి నిర్మాతలు అంత బడ్జెట్ ఖర్చుపెట్టారు. కానీ మేం సినిమాకు ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే డిజైన్ చేశాం. అలాగే కోవిడ్ టైమ్‌లో ‘రాధేశ్యామ్’ చిత్రం కోసం వినియోగించిన వైద్యపరికరాలను కరోనా బాధితులకు ఉపయోగపడేలా చేయడం సంతోషాన్నిచ్చింది.
‘‘రాధేశ్యామ్’ క్లాసిక్ ఫిల్మ్’’ అన్నారు జస్టిన్ ప్రభాకరన్.
‘సలార్’ చిత్రం రెండు భాగాలుగా రానుందా? అన్న ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ... ‘‘ఈ విషయం గురించి మరో సందర్భంలో మాట్లాడతాను. త్వరలో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయనున్నాను. ఇక ఇప్పటికిప్పుడు నాకు జాతకం చూసే శక్తులు వస్తే ‘రాధేశ్యామ్’ గురించిన రిజల్ట్‌ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment