టైటిల్: ప్రేమదేశపు యువరాణి
నటీనటులు: యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి, మెహబూబ్ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్, పవన్ ముత్యాల, రాజారెడ్డి, సందీప్, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు తదితరులు
నిర్మాణ సంస్థలు: ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్
దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల
సంగీతం: అజయ్ పట్నాయక్
సినిమాటోగ్రఫీ: శివకుమార్ దేవరకొండ
ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
విడుదల తేదీ: 02-09-2023.
ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలకు చక్కటి రెస్పాన్స్ వచ్చింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
అమలాపురంలో వీరయ్య అనే రౌడీ షీటర్ చాలామంది ప్రజలను ఇబ్బంది పెడుతూ.. ఎదురు తిరిగిన వారిని చంపుతూ.. నచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతుంటాడు. అయితే అదే ఊర్లో బీటెక్ ఫెయిలై తాగుతూ జూలాయిగా తిరుగుతున్న చెర్రీ (యామిన్ రాజ్)కి, శ్రావణి (ప్రియాంక రేవ్రి) కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెనే తన ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అయిపోతాడు.ఆమె గురించి ఫ్రెండ్స్ ద్వారా ఆరా తీస్తాడు. అయితే రావులపాలెం నుంచి ఉద్యోగ రీత్యా శ్రావణి కుటుంబం అమలాపురంకు వచ్చిందని శ్రావణి తండ్రి, చెర్రీ తండ్రి ఇద్దరు చిన్ననాటి స్నేహితులని తెలుస్తుంది. ఆ తరువాత శ్రావణితో పరిచయం కావడం.. దీంతో చెర్రీ బీటెక్ పాసయ్యేందుకు హెల్ప్ చేస్తానని ఆమె అంటుంది. ఆలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. చివరకు పెళ్లి చేసుకుందామని చెర్రీ చెప్పగానే.. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా నాకు చాలా గోల్స్ ఉన్నాయని నో అంటుంది. అయితే పెళ్లి విషయంలో శ్రావణిని చెర్రీ నిలదీయడంతో రవి (విరాట్ కార్తిక్)ను ఇష్టపడ్డానని చెబుతుంది. దీంతో షాక్ తిన్న చెర్రీ శ్రావణి ప్రేమను దక్కించు కోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు శ్రావణి చెర్రీని పెళ్లి చేసుకుందా? అనేదే అసలు కథ.
అంతే కాకుండా మరో వైపు అదే ఊరిలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. వీటి వల్ల రౌడీ షీటర్ వీరయ్య మనుషులు చనిపోతూ ఉంటారు. అసలు ఈ మర్డర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే విషయాలు తెలిసేలోపే రౌడీ షీటర్ వీరయ్యతో పాటు తన కొడుకు భైరవ్ హత్యకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది? అసలు ఈ రవి ఎవరు? తనకు శ్రావణి ఎందుకు దూరంగా ఉంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తను కలెక్టర్ అవుతుందా? చివరకు శ్రావణి చెర్రీ కు దగ్గరైందా? లేక రవికి దగ్గరైందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో తప్పకుండా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎమోషనల్ ఉన్న సబ్జెక్ ను ఫీల్‌గుడ్ లవ్‌స్టోరిని తెరకెక్కించారు సాయి సునీల్ నిమ్మల. ఆసక్తికర సన్నివేశాలతో చక్కని కథను మలిచారు. డబుల్ మీనింగ్ జోకులు.. కుల్లి కామెడీ లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు సాయి సునీల్ నిమ్మల సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అజయ్ పట్నాయక్ అద్భుతమైన సంగీతం సినిమాకు ప్లస్. ఆర్‌పీ, పట్నాయక్, సునీత పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ‘ప్రేమదేశపు యువరాణి’ సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.
ఎవరెలా చేశారంటే?
చెర్రీ పాత్రలో నటించిన (యామిన్ రాజ్) తన నటనతో అన్ని విధాలుగా ఆకట్టుకున్నాడు. శ్రావణి పాత్రలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక రేవ్రి తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది. రవి పాత్రలో లెక్చరర్‌గా నటించిన విరాట్ కార్తిక్ తన పాత్రకు న్యాయ చేశాడు. హీరోకు ఫ్రెండ్స్‌గా నటించిన మెహబూబ్ బాషా, బండ సాయి, బక్క సాయి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో శంకర్ గా నటించిన రాజారెడ్డి నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు, క్రైమ్‌ను సాల్వ్ చేసే విషయంలో పోలీసుల ఇన్వేస్టిగేషన్, వారి ఆలోచన తీరు, వారు వేసే ఎత్తులు, ఎలా ఉంటాయనే సన్నివేశాల్లో సహజమైన నటనతో పాటు పాత్రలో ఒదిగిపోయాడు. వీరయ్య పాత్రలో సందీప్ క్రూరమైన విలన్ గా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరో తల్లి తండ్రులుగా హరికృష్ణ, సునీత, యోగి కద్రి, రఘు, ముత్యాల, రాజారెడ్డి, స్రవంతి, , ప్రత్యూష, గోపీనాయుడు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు. సాంకేతికత విషయాకొనికొస్తే శివకుమార్ దేవరకొండ సినిమాటోగ్రఫీ బాగుంది.. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. ఎం.ఆర్. వర్మ ఎడిటింగ్ పనితీరు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.
-మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment