‘‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభించినప్పుడే మే లేదా జూన్‌లోగా పూర్తి చేసి, ఆగస్ట్ 9న విడుదల చేయాలనుకున్నాం. అయితే సాంగ్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ తేదీన రిలీజ్ చేయలేదు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ వాయిదా పడటంతో ఆగస్ట్ 15 సరైన తేదీ అని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జోడీగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘రవితేజగారితో మేం నిర్మించిన ‘ధమాకా’ మంచి హిట్టయింది.
‘ధమాకా’కి ప్లస్‌లా ‘మిస్టర్ బచ్చన్’ ఉంటుంది. హరీష్ శంకర్, రవితేజలది క్రేజీ కాంబినేష్. ‘మిస్టర్ బచ్చన్’ కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్. ఇందులో వినోదం, మాస్, యాక్షన్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. హరీష్‌కి, మిక్కీ జె. మేయర్‌కి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అంత గ్రాండ్ ఔట్‌పుట్ తీసుకొచ్చారు. పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. ఆగస్ట్ 15కి తెలుగులో రెండు పెద్ద సినిమాలు ‘మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్’ వస్తున్నాయి.
థియేటర్ల పరంగా ఈ రెండింటికీ ఎలాంటి సమస్య రాదు. పైగా లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తెలుగుతో పాటు హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నాం. మా సంస్థ నుంచి దాదాపు 15 సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిలో కన్నడంలో మూడు సినిమాలు, హిందీలో బాబీ డియోల్‌తో ఒక సినిమా, రెండు ఇంగ్లిష్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’ షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ ఏడాదిలోపు చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment