‘‘మా ప్రాజెక్ట్స్ అన్నీ రిస్క్‌తో కూడు కున్నవే... కమర్షియల్స్ కాదు... అందుకే కంటెంట్‌ని నమ్మి సినిమా బండి’ విషయంలో మరోసారి రిస్క్ తీసుకున్నాం. మా నమ్మకం మంచి ఫలితాన్ని ఇచ్చింది’’ అన్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. వికాస్ వశిష్ఠ, సందీప్, రాగ్ మయూర్, ఉమ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సినిమా బండి’. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రాజ్ అండ్ డీకే చెప్పిన విశేషాలు.
► ప్రవీణ్ మా దగ్గర వర్క్ చేయలేదు. కానీ ‘సినిమా బండి’ కంటెంట్, ప్రవీణ్ నైపుణ్యం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. కొత్తవాళ్ల ప్రతిభను నమ్మి, మా డబ్బులతోనే చిన్న సినిమాలను ప్రోత్సహించాలనుకున్నాం. వేరే స్టూడియోస్‌కి వెళితే వాళ్ల జోక్యం ఉంటుంది. అలా అయితే క్రియేటివ్ పరంగా ఇబ్బందులు వస్తాయనుకుని ‘డీటుఆర్ ఇండీ’ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాం. ‘సినిమా బండి’ నిర్మించాం. ఈ సినిమాకి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది.
► మా సినిమా కెరీర్ హైదరాబాద్ నుంచే మొదలైంది. సినిమాలపై ప్రేమతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏడాది పాటు ఇక్కడే ఉన్నాం. తెలుగు సినిమాలు తీయా లని ప్రయత్నించాం. సమయం గడుస్తోంది కానీ సినిమాలు కుదర్లేదు. సరే.. మా కథలు ఇక్కడ నచ్చవేమో అనుకుని హిందీకి వెళ్లాం. అయితే తెలుగు సినిమాకు కనెక్ట్ అయ్యే ఉన్నాం. హీరోలు మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ... ఇలా మరికొంత మంది హీరోలతో మాకు మంచి అనుబంధం ఉంది. మంచి కథ కుదిరితే మా దర్శకత్వంలో తెలుగులో సినిమా ఉంటుంది.
► ఆ రకం సినిమాలు చేయండి, ఈ రకం సినిమాలు తీయండి, రీమేక్ సినిమాలు చేయండి.. అని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ మేం మా ఆలోచనాధోరణికి తగ్గ సినిమాలే చేస్తున్నాం. మా నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోంది. దర్శక–నిర్మాతలుగా మేం చేసిన ‘ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో నిర్మించిన ‘స్త్రీ’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్. ఇప్పుడు నిర్మించిన ‘సినిమా బండి’ చిన్న సినిమా అయినా మంచి స్పందన లభిస్తోంది. మా ఇద్దరి మధ్య వాదనలు జరగవని కాదు. కానీ మా గొడవ అంతా మంచి అవుట్‌పుట్ కోసమే.
► భవిష్యత్‌లో ఓటీటీల హవా ఉంటుందని మేం ఐదేళ్ల క్రితమే ఊహించాం. 2016లో ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ కోసం అమెజాన్‌తో సైన్ చేశాం. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పుడు ఉన్నంత పాపులారిటీ అప్పుడు లేదు. టెక్నాలజీ, కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ వంటి కారణాల వల్ల ఓటీటీలు ప్రేక్షకులకు వేగంగా దగ్గరయ్యాయి. ఇక 2016లోనే మేం ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్‌సిరీస్ సైన్ చేసినా.. ఇతర కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకుని షూటింగ్ మొదలు పెట్టడానికి రెండేళ్లు పట్టింది.
► సినిమా కావొచ్చు, వెబ్ సిరీస్ కావొచ్చు.. ఇది చిన్న పిల్లల కంటెంట్, ఇందులో హింస ఎక్కువగా ఉంది, ఇది పెద్దల సినిమా అంటూ.. ఆ ప్రాజెక్ట్ కంటెంట్‌కు ఒక గుర్తింపు ఉంటే మంచిదే. ఇక సెన్సార్‌షిప్ విషయానికి వస్తే.. మా వరకు మేం ఒక సెల్ఫ్ సెన్సార్‌ను ఫాలో అవుతాం. చైల్డ్ అబ్యూజ్, మితిమీరిన హింస వంటి అంశాలకు సంబంధించి అందరి ఫిల్మ్ మేకర్స్‌కు నియమనిబంధనలు ఉండటం మంచిదే. ఓటీటీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తే, అవి వ్యూయర్స్‌కు మేలు చేయాలని మేం కూడా కోరుకుంటాం.
► షారుక్ ఖాన్‌కి ఓ కథ చెప్పాం. ఆయనకు నచ్చింది. కానీ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్‌కు కాస్త టైమ్ పడుతుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లోని వెబ్ సిరీస్ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. మరొక మూడు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి.
‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నాం. ఆ ట్రైలర్‌లో సమంత పాత్ర గురించి మరింత తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంతను తీసుకోవడానికి కారణం ఉంది. ఆమె క్యారెక్టర్‌లో కొన్ని షేడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్... సమంతది విలన్ పాత్ర అని చెప్పలేం కానీ మనోజ్ బాజ్‌పాయ్‌కి అపోజిట్ క్యారెక్టర్. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నాం.
రాజ్, డీకేతో సమంత
ఇక్కడ మా కథలు నచ్చవని హిందీకి వెళ్లాం
Published Sun, May 16 2021 12:23 AM | Last Updated on Sun, May 16 2021 3:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment