
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం(మార్చి 25)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. తొలిరోజే దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను చూసిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంటే, చూడని వారు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్ర మేనియాలో సెలబ్రిటీలు కూడా వరుసగా ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు చాలామంది టాలీవుడ్ హీరోలతో ప్రముఖ దర్శక నిర్మాతలు సైతం ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంపై తనదైన శైలీలో స్పందించాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బాహుబలితో ఆర్‌ఆర్‌ఆర్‌ని పోలుస్తూ ఇదొక చారిత్రాత్మక చిత్రం అని కొనియాడాడు. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ఆర్‌ఆర్‌ఆర్ అనేది చారిత్రాత్మకం’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.అలాగే దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి... బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి అనే అర్థంలో ఆర్జీవీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
BAHUBALI 2 is history, RRR is HISTORICAL and @ssrajamouli is MYSTICAL for making the boxoffice SPIRITUAL 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2022