చీటింగ్ కేసులో అరెస్టయిన తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తనను అన్యాయంగా కేసులో ఇరికించాడని వాపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'నాకు మా అమ్మ తర్వాత మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె నాకు దొరికిన వరం. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. ట్రోలర్స్ ఎన్నైనా అనుకోండి.. ఎంతైనా తిట్టుకోండి. కానీ మమ్మల్ని వేరు చేయలేరు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పుడు కింద కూర్చోమన్నారు.
కానీ అందరికీ వారి శరీరం సహకరించినట్లుగా నా బాడీ నాకు సహకరించదు. నేను చెప్పేది కూడా వినకుండా అరెస్ట్ చేసి లాక్కెళ్లారు. నేను ఏ తప్పూ చేయలేదు. నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తే అనేక తప్పుడు పనులు చేశాడు, దొంగతనాలు చేశాడు. అవన్నీ నాకు తెలిసిపోవడంతో నామీదే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. నేను అతడిని వదిలిపెట్టను. తన బండారం మొత్తం బయటపెడతాను, దోషిగా నిరూపిస్తాను' అంటూ ఏడ్చేశాడు రవీందర్.
ఏ కేసులో అరెస్ట్ అయ్యాడంటే?
వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మించాడు రవీందర్. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్ ప్రాజెక్ట్‌ను పక్కన పడేశాడని, కనీసం తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదని బాలాజీ వాదన. దీంతో అతడు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే అతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment