
డబ్బు సాయం చేయకపోతే చచ్చిపోతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోయింది. ఇలాంటి మెసేజ్‌లు చేస్తే..
'పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు' అన్న చందంగా సాయం చేసే మనుషులకే అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతాయి. మంచి మనసుతో సాయం చేద్దామని సంకల్పించినవారికి తోడుగా నిలబడతారో లేదో కానీ వారు చేసే పనిని మాత్రం ప్రశ్నించేందుకు, అందులో తప్పులు వెతికేందుకు రెడీగా ఉంటారు. టాలీవుడ్ నటి, నిర్మాత రేణు దేశాయ్ సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని కరోనా పేషెంట్లకు బెడ్లు, ఆక్సిజన్, మందులు వంటి వాటిని అందించేందుకు ఎంతగానో కృషి చేస్తోంది. అయితే ఆమె చేస్తున్న పనిని ప్రశంసించాల్సింది పోయి కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఉన్నవారికే సాయం చేస్తున్నావంటూ నిష్టూరంగా మాట్లాడారు. దీంతో తను అందరికీ సమానంగా సహాయం చేస్తున్నానని రేణు దేశాయ్ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు తనకు మరో సమస్య ఎదురైంది. డబ్బు సాయం చేయకపోతే చచ్చిపోతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోయింది. ఇలాంటి మెసేజ్‌లు చేస్తే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించింది. తను ఎవరికీ ఆర్థిక సాయం చేయలేనని మరోమారు స్పష్టం చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు, నిత్యావసరాలు మాత్రమే అందించగలనని తెలిపింది.