మరో వారం రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయిపోయింది.
తాజాగా ప్రముఖ దర్శకుడు అలిల్ రావిపూడి ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చరణ్‌తో తనకు చాలా ఏళ్లుగా స్నేహంబంధం ఉందని చెప్పారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డామని, కానీ ఒక్క రాజమౌళికి తెలియడంతో ఈ సినిమా తీశారని చెప్పుకొచ్చారు. అలాగే చిత్ర పరిశ్రమలో తనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరు? ఎవరితో ఎక్కువ స్నేహ బంధం ఉంది అనే విషయాలను తెలియజేస్తూ.. ‘ఎలాంటి మొహమాటం లేకుండా నన్ను విమర్శించే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు మానాన్న (హరికృష్ణ). రెండోది రాజమౌళి. నేను కెరీర్ పరంగా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం జక్కన్ననే’అని తారక్ ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న చరణ్.. తారక్ కెరీర్‌లో భారీ విజయాలు సాధించిన సినిమాల్లో జక్కన్నవే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాగా, రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో స్టూడెంట్ నెం.1(2001), సింహాద్రి(2003), యమదొంగ(2007), ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment