అభినవ్ శుక్లా, రుబీనా దిలైక్
బిగ్‌బాస్ హిందీ రియాల్టీ షోలో 143 రోజులు హౌస్‌లో ఉండి విజేతగా నిలిచింది టీవీ నటి రుబీనా దిలైక్. వాదనల్లో ఎదుటివారిని తల వాచిపోయేలా చేయగలిగే ఈ నటి బిగ్‌బాస్ షోలో ఉన్నన్ని రోజులు సోషల్ మీడియాలో బాగానే మద్దతు సంపాదించింది. విజేతగా వచ్చే కీర్తితో పాటు ఇదే షోలో పాల్గొన్న భర్త అభినవ్ శుక్లాతో తన వివాహబంధం గట్టిపడిందని చెబుతోంది. ‘విడాకులు తీసుకోవాల్సిన మేము ఈ షో వల్ల ఒకరినొకరం అర్థం చేసుకున్నాం’ అందామె. 33 ఏళ్ల ఈ సిమ్లా సెలబ్రిటీ పరిచయం...
తెలుగు బిగ్‌బాస్ షో నాలుగుసార్లు జరిగితే ఒక్కసారి కూడా స్త్రీలు విజేతగా నిలువలేదు. కాని బిగ్‌బాస్ హిందీ షో 14 సీజన్‌లు గడిస్తే ఇప్పటికి ఐదారుసార్లు స్త్రీలు విజేతలుగా నిలిచారు. తాజాగా బిగ్‌బాస్ 14 విజేతగా టీవీ నటి రుబీనా దిలైక్ నిలిచింది. పేరు, గుర్తింపుతో పాటు ప్రైజ్‌మనీగా 36 లక్షల రూపాయలు ఆమెకు దక్కాయి. అయితే అదంత సులువుగా జరగలేదు.
143 రోజులు హౌస్‌లో
23 మంది కంటెస్టెంట్‌లు. 143 రోజులు. ముంబై శివార్లలోని గోరేగావ్‌లో వేసిన సెట్‌లో ఉండిపోవడం అంటే సామాన్యం కాదు. అక్టోబర్ 3న మొదలైన ఈ షో ఫిబ్రవరి 21న గ్రాండ్ ఫినాలెతో ముగిసింది. రుబీనా ఈ షోలో విజేతగా నిలిచింది. 33 ఏళ్ల రుబీనాది సిమ్లా. బాల్యంలోనే డిబేట్ ఛాంపియన్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ‘మిస్ సిమ్లా’గా ఆ తర్వాత ‘మిస్ నార్త్ ఇండియా’గా కిరీటాలు దక్కించుకుంది. ఆ తర్వాత 2008లో జీ టీవీలో ప్రసారమైన ‘ఛోటి బహూ’ సీరియల్‌తో గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘లైఫ్ ఓకే’ చానల్‌లో వచ్చిన ‘దేవోంకే దేవ్.. మహాదేవ్’ సీరియల్‌లో సీత పాత్ర పోషించింది. కాని ఆ గుర్తింపు వేరు ఇప్పుడు బిగ్‌బాస్‌తో వచ్చిన గుర్తింపు వేరు.
కెమెరాకు ఎదురు నిలిచి
బిగ్‌బాస్‌లో రుబీనాకు అన్నీ అనుకూలంగా లేవు. ఆమె ప్రతి ఒక్కరితో వాదనకు దిగేది. వాదన చేయడానికి వెనుకాడేది కాదు. మనకెందుకులే అని ఊరుకునేది కాదు. ఇది కొందరికి నచ్చలేదు. సల్మాన్ ఖాన్‌కు కూడా నచ్చలేదు. ‘ఈ సరంజామా తీసుకునా నువ్వు వచ్చింది’ అని అతను షోలో కామెంట్ చేయడంతో రుబీనా బాగా హర్ట్ అయ్యింది. షో నుంచి బయటకు వెళ్లిపోతానని హటం చేసింది. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. కాని రుబీనాకు కొద్దిరోజుల్లోనే హౌస్‌లో బయట అభిమానులు ఏర్పడ్డారు. రుబీనా ప్రేమను పంచుతోంది అని హౌస్‌మేట్స్ అన్నారు. బయట రుబీనా అభిమానులు తమని తాము ‘రుబీహాలిక్స్’ అని పేరు పెట్టుకుని సపోర్ట్‌గా నిలిచారు. టాస్క్‌ల్లో రుబీనా పోరాట పటిమ కూడా అందరికీ నచ్చింది.
రాహుల్ వైద్యా, నిక్కి తంబోలి
భర్తతో అడుగుపెట్టి...
లాక్‌డౌన్ అందరి జీవితాల్లో ఎలా సంక్షోభం తెచ్చిందో రుబీనా జీవితంలో కూడా అలాంటి సంక్షోభమే తెచ్చింది. ఆమె టీవీ నటుడు అభినవ్ శుక్లాను ప్రేమించి 2018లో వివాహం చేసుకుంది. కాని బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి వాదనలు నడిచేవో ఇంటిలో కూడా అలాంటి వాదనలే నడిచేవి. లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఇద్దరూ ఉండేసరికి గొడవలు శ్రుతి మించాయి. ‘కథ ఇలాగే ఉంటే మనం విడాకులు తీసుకుందాం. ముందు మనం ఆరు నెలలు దూరంగా ఉందాం’ అని అని భార్యాభర్తలు ఇద్దరూ అనుకున్నారు. అనుకోకుండా ఇద్దరికీ కలిపి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశం దొరికింది. బయటవారికి ఈ సమాచారం లేనందున ఇరువురూ అన్యోన్య దంపతుల ఖాతాలో హౌస్‌లో అడుగుపెట్టారని అనుకున్నారు. కాని షో కొనసాగే కొద్ది వారి మధ్య ఉన్న స్పర్థలు ప్రేక్షకులకు తెలిశాయి.
ఆ తర్వాత వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా కనిపించింది. చాలా సందర్భాలలో ఒకరికి ఒకరు సపోర్ట్‌గా నిలిచారు. సల్మాన్ ఖాన్ తో రుబీనాకు గొడవ వచ్చినప్పుడు భర్త అభినవ్ ఆమెకు సర్ది చెప్పాడు. అంతేకాదు షోలో జరిగే ‘బెస్ట్ జోడీ’ కాంపిటీషన్‌లో ఈ భార్యాభర్తలే బెస్ట్‌గా నిలిచారు. ‘బిగ్‌బాస్ హౌస్‌కు కృతజ్ఞతలు. ఈ హౌస్‌లో ఉండటం వల్లే మేము ఒకరికి ఒకరం అర్థమయ్యాం. మా చేదు తగ్గింది. మేము కలిసి జీవించాలనుకుంటున్నాం’ అని షో ముగిశాక ఇద్దరూ అన్నారు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో నటుడు వరుణ్ సందేశ్ తన భార్య వితికతో కలిసి పాల్గొన్నాడు. కాని వారికి ఇలాంటి సమస్య లేదు. సమస్య ఉన్న రుబీనాకు బిగ్‌బాస్‌లో ఉండటం లాభించింది. – సాక్షి ఫ్యామిలీ
గట్టి పోటీ
బిగ్‌బాస్ హౌస్‌లో రుబీనాకు గాయకుడు రాహుల్ వైద్యా నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. అతడికి కూడా ఫ్యాన్స్ మద్దతు లభించింది. విజేత అతడు కూడా కావచ్చునని అందరూ అనుకున్నారు. కాని రుబీనాకు కిరీటం దక్కింది. రాహుల్ వైద్య ఫస్ట్ రన్నర్ అప్‌గా నిలిచాడు. మరో నటి నిక్కి తంబోలి, నటుడు అలి గోని మూడు, నాలుగు స్థానాల్లో మిగిలారు.
‘తెలుగు నటి’
బిగ్‌బాస్ 14 హిందీ రియాలిటీ షోలో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన నిక్కి తంబోలి తెలుగులో ‘చీకటిగదిలో చితక్కొట్టుడు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘తిప్పరా మీసం’, ‘కాంచన 3’లో ముఖ్యపాత్రలు పోషించింది. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన రుబీనా, నిక్కి కొత్తల్లో కీచులాడుకున్నా ఆ తర్వాత మంచి స్నేహితులయ్యారు.
చదవండి: (బిగ్‌బాస్ విన్నర్‌గా రుబీనా, ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment