టైటిల్: సామజవరగమన
నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీకే నరేశ్, శ్రీకాంత్, వెన్నెల కిశోర్, సుదర్శన్ తదితరులు
నిర్మాణ సంస్థ:హాస్య మూవీస్
నిర్మాత: రాజేశ్ దండా
సమర్పణ: అనిల్ సుంకర్
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ:రామ్ రెడ్డి
ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
విడుదల తేది: జూన్ 29, 2023
వైవిద్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త వెనకబడ్డాడు. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘సామజవరగమన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్,ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సామజవరగమనపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శ్రీవిష్ణుకి అచ్చొచ్చిన కామెడీ జానర్‌తో హిట్ ట్రాక్ ఎక్కడా ? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు(శ్రీవిష్ణు) థియేటర్ బాక్సాఫీస్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. అతని తండ్రి ఉమామహేశ్వరరావు(నరేశ్)కు వేలకోట్ల ఆస్తి ఉంటుంది కానీ.. కొడుకు డిగ్రీ పాసైతేనే అది అతనికి చెందుతుందని బాలు తాత వీలూనామా రాసి చనిపోతాడు. దీంతో తన తండ్రిని ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని నానా ఇబ్బందులు పడుతూ చదివిస్తుంటాడు బాలు. ఉమామహేశ్వరరావు మాత్రం 30 ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. బాలు ఒక్కడే ఉద్యోగం చేసి ఫ్యామిలీని పోషిస్తుంటాడు. ఓ సారి ఎగ్జామ్ హాల్‌లో ఉమామహేశ్వరరావుకు డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చిన స్టూడెంట్ సరయు(రెబా మౌనికా జాన్) పరిచయం అవుతుంది. ఆమెకు హాస్టల్‌లో ఉండడం ఇబ్బంది కావడంతో బాలు ఇంట్లోకి పెయింగ్ గెస్ట్‌గా వస్తుంది.
బాలు ప్రవర్తను చూసి అతనితో ప్రేమలో పడుతుంది. బాలుకి మాత్రం ప్రేమ అంటే అస్సలు నచ్చదు. అంతేకాదు ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తున్నాను అని చెబితే వెంటనే ఆమెతో రాఖీ కట్టించుకుంటాడు. అలాంటి బాలు సరయుతో ఎలా ప్రేమలో పడ్డాడు? ఐలవ్ యూ చెప్పిన అమ్మాయిలతో బాలు ఎందుకు రాఖీ కట్టించుకుంటాడు? సరయు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్)కి ప్రేమ పెళ్లిళ్లు అంటే ఎందుకు నచ్చదు? సరయు అక్కకి, బాలు బావకి పెళ్లి సెట్ అయిన తర్వాత వీరి ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? లేదా? చివరకు సరయు, బాలు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
కొన్ని సినిమాల కథలు చెప్పడానికి చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. ఆ కేటగిరీలోకి ‘సామజవరగమన’ వస్తుంది. కథలో కొత్తదనం లేకున్నా చక్కటి స్క్రీన్‌ప్లేతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రామ్. కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో కథను రాసుకున్నాడు. అలా అని పూర్తిగా కామెడీనే నమ్ముకోలేదు. కావాల్సిన చోట ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేందుకు ఎమెషనల్ సన్నివేశాలను కూడా యాడ్ చేశాడు. సినిమాలోని ప్రతి పాత్రకు కామెడీ టచ్ ఉంటుంది.
తండ్రిని డిగ్రీ పరీక్ష పాస్ చేయించడం కోసం కొడుకు పడే ఇబ్బందులతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రతి సీన్ హిలేరియస్‌గా ఉంటుంది. ట్యూషన్ సెంటర్‌లో నరేశ్, హీరోయిన్ చేసే కామెడీ, రఘుబాబు వేసే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాల గురించి హీరో చెప్పే నాన్‌స్టాప్ డైలాగ్ అయితే ఫస్టాఫ్‌కే హైలెట్. ఈ డైలాగ్‌కి యూత్ అంతా కనెక్ట్ అవుతారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్‌పై ఆసక్తికి పెంచుతుంది.ఇక సెకండాఫ్ కూడా కథను పూర్తి వినోదాత్మకంగా మలిచాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో కొన్నిచోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ‘కుల’ శేఖర్‌గా వెన్నెల కిశోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.అయితే ఈ తరహా పాత్రతో యూట్యూబ్‌లో చాలా వీడియోలు వచ్చాయి. నాని ‘జర్సీ’లోని ఓ ఎమోషనల్ సీన్‌ని పేరడీ చేసి బాగా నవ్వించారు. బూతు సీన్లు, డబుల్ మీనింగ్ డైగాల్స్ లేకుండా క్లీన్ కామెడీతో ఇంటిల్లి పాది కలిసి చూసి నవ్వుకునే సినిమా ఇది.
ఎవరెలా చేశారంటే..
ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. బాలు పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీతో పాటు కావాల్సిన చోట ఎమోషన్‌ని కూడా చక్కగా పండించాడు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు తర్వాత బాగా పండిన పాత్ర నరేశ్‌ది. తండ్రి పాత్రలు నరేశ్‌కి కొత్తేమి కాదు కానీ.. ఈ సినిమాలో ఆయన నటించిన తండ్రి పాత్ర మాత్రం చాలా కొత్తది. ఆ పాత్రకు నరేశ్ మాత్రమే న్యాయం చేయగలడు అనేలా అతని నటన ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి నరేశ్ మరో హీరో అనొచ్చు. తనదైన కామెడీతో అందరికి ఆకట్టుకున్నాడు.
సరయు పాత్రకి రెబా మౌనికా న్యాయం చేసింది. కుల శేకర్‌గా వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఉన్నంతలో కామెడీ పండించాడు. హీరో ఫ్రెండ్‌గా సుదర్శన్, హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్‌తో పాటు రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఈ సినిమాకు చాలా ప్లస్. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment