
విలక్షణ నటుడు శరత్‌బాబు మరణంతో టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 200కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
అప్పటికే నటిగా, స్టార్ కమెడియన్‌గా రమాప్రభకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో శరత్‌బాబును సినిమాల్లో రికమండ్ చేసి వేషాలు ఇప్పించారని వార్తలు వచ్చేవి. ఆ సమయంలో వీరి సాన్నిహిత్యంపై కథలు కథలుగా పుకార్లు షికార్లు చేశాయి. చివరికి వాటినే నిజం చేస్తూ వయసులో తనకంటే నాలుగేళ్ల పెద్దదైన రమప్రభను శరత్‌బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది.
అప్పట్లో శరత్ బాబు తాను మరచిపోలేని రోజులు మూడే అని అందులో ఒకటి తన పుట్టినరోజు కాగా, రెండు రెండు తన భార్య రమ పుట్టినరోజు, మూడు తమ పెళ్ళి రోజూ అంటూ ఓ సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment