
Shagufta Ali: 36 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బుల్లితెర తార షగుఫ్త అలీ. ఎన్నో సీరియళ్లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమెకు ఇప్పుడు కనీస అవకాశాలు రాక దీన స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. దీనికితోడు రోజురోజుకూ తనను అనారోగ్యం మరింత కుంగ తీస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో సాయం కోసం అర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి విని చలించిపోయిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న షగుఫ్త తాజాగా డ్యాన్స్ దీవానీ 3 షోకు వెళ్లగా అక్కడ తన బాధలను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది.
"ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 36 ఏళ్లలో 32 ఏళ్లు అద్భుతంగా నడిచాయి. ఎంతో కష్టపడ్డాను, ఎంతగానో పని చేశాను, నాకు, నా కుటుంబానికి మద్దతుగా నిలిచాను. కానీ నాలుగేళ్ల క్రితం ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లాను, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. పైగా ఆ సమయంలో మధుమేహం వల్ల నా కాలు నొప్పి తీవ్రం కాసాగింది. అది నెమ్మదిగా నా కంటిచూపును దెబ్బ తీయడం మొదలు పెట్టింది. నాలుగేళ్లుగా ఈ బాధను భరించలేకపోతున్నాను. చిత్రపరిశ్రమ నాకు సొంతిల్లులాంటిది. 36 ఏళ్ల జీవితాన్ని దీనికి అంకితమిచ్చాను" అంటూ ఏడ్చేసింది.
షగుఫ్త మాటలతో అక్కడున్న వారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. రియాలిటీ షో జడ్జి, నటి మాధురీ దీక్షిత్ వెంటనే షగుఫ్తను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అమ్మడానికి కూడా ఏమీ మిగల్లేని దీన స్థితికి చేరుకున్నందుకు విచారం వ్యక్తం చేసింది. డ్యాన్స్ దీవానే టీమ్ తరపు నుంచి రూ.5 లక్షల చెక్‌ను అందజేసింది. దీంతో చెక్‌ను అందుకున్న నటి భావోద్వేగానికి లోనైంది. గతంలో నీనా గుప్తా, సుమీత్ రాఘవన్, సుశాంత్ సింగ్ తనకు సాయం చేశారని గుర్తు చేసుకుంది. అలాగే తాజాగా రోహిత్ శెట్టి కూడా ఆమెకు ఆర్థిక సాయం చేశాడని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ మీడియాకు వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment