టైటిల్ : షరతులు వర్తిస్తాయి
నటీనటులు: చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు
నిర్మాణ సంస్థ: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
దర్శకత్వం: కుమారస్వామి (అక్షర)
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
విడుదల తేది: మార్చి 15, 2024
కథేంటంటే..
చిరంజీవి(చైతన్య రావు) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటాడు. నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగం చేసుకుంటూ.. చెల్లి, తమ్ముడిని చదివించడానికి కష్టపడుతుంటాడు. అతని స్కూల్‌మేట్ విజయశాంతి అలియాస్ విజయ(భూమి శెట్టి)ని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తాడు. విజయ కూడా అతన్ని ప్రేమిస్తుంటుంది. కష్టకాలంలో ఆర్థిక సహాయం చేసి తోడుగా నిలుస్తుంది. వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లి కూడా చేస్తారు. సాఫీగా సాగిన వీరి జీవితంలోకి చైన్ సిస్టమ్ బిజినెస్ వచ్చి నాశనం చేస్తుంది.
కొంత డబ్బు కట్టి మీ తరపున నలుగురిని జాయిన్ చేయిస్తే బోలెడు డబ్బు వస్తుందంటూ ఆశపెట్టి.. ఊరందిరితో డబ్బులు కట్టిస్తారు. ఆ ఏరియా లీడర్, వచ్చే ఎన్నికల్లో కార్పోరేటర్‌గా నిలబడాలనుకునే శంకరన్న భరోసా ఇవ్వడంతో చాలా మంది డబ్బులు కట్టడమే కాకుండా వారి తరపును మరో నలుగురిని జాయిన్ చేయింస్తారు. చిరంజీవికి తెలియకుండా తన భార్య, తల్లి కూడా ఈ బిజినెస్ కోసం డబ్బులు కడతారు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు చేసిన మోసగాళ్లు..రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తారు. అసలు ఆ భోగస్ కంపెనీ ఎవరిది? శంకరన్నని ముందు పెట్టి ఎందుకు డబ్బులు వసూలు చేశారు? తన డబ్బులు కూడా పోయాయని తెలిసిన తర్వాత చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి మోసపోయిన విజయశాంతి చివరకు ఏం చేసింది? కార్పోరేషన్ ఎన్నికలకు ఈ మోసానికి గల సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇదొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉంటాయి? అలాంటి వాళ్లు మోసానికి గురైతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు కుమార్. గొలుసు కట్టు మోసం అనేది తరచూ వార్తల్లో వింటుంటాం. డబ్బు ఆశతో ఒక్కొక్కరు నలుగురిని జాయిన్ చేయించడం.. అలా పెద్ద మొత్తంలో జనాన్ని చేర్పించిన తర్వాత బోర్డు తిప్పేసి పరారైతే.. ఆ కుటుంబాల ఎలా బాధపడతాయి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
అచ్చమైన తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాప్ చిరంజీవి, విజయ లవ్ స్టోరీ, వారి కుటుంబాల పరిస్థితి, మిడిస్ క్లాస్ ఫ్యామిలీల కష్టాల చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలు.. వాట్సాప్ స్టేటస్‌లు.. అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్దిచెప్పించే తీరు..ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. డబ్బు ఆశ చూపుతూ గోల్డెన్ ప్లేట్ అనే చిట్ కంపెనీ రావడం..దానికి శంకరన్న మద్దతు తెలపడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌గా ఉంటూనే సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నెమ్మదిగా సాగుతూ..ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఫస్టాఫ్‌లో వర్కౌట్ అయిన ఎమోషన్.. సెకండాఫ్‌లో కాలేదు. ఎన్నికలకు సంబంధించిన ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
మధ్యతరగతి యువకుడు చిరంజీవి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు. మిడిల్ క్లాస్ గృహిణిగా,భూమి శెట్టి మెప్పించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. నంద కిషోర్, , వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ తెరపై చాలా నేచురల్‌గా కనిపించింది. తెలంగాణలోని పలు జలయశయాలని కూడా తెరపై చక్కగా చూపించారు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఎలాంటి కమర్షియల్ ఆడంబరాలకు వెళ్లకుండా చాలా సహజంగా మధ్యతరగతి మనుషుల కథను చెప్పిన దర్శకుడిని మాత్రం అభినందించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment