సీరియల్ నటి నుంచి హీరోయిన్‌గా మారింది భూమి శెట్టి. ఈ కన్నడ అందం 'షరతులు వర్తిస్తాయి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మాది కర్ణాటక ప్రాంతం. మా ఇంట్లో ఇంజనీరింగ్ చేస్తానంటే ఒప్పుకోలేదు. నీకు ఇంజనీరింగ్ ఎందుకు? పెళ్లి చేసేస్తాం.. అన్నారు. లేదు, చదువు కొనసాగిస్తానంటే నాతో మాట్లాడటం మానేస్తామని బెదిరించారు.
ఆరేళ్లు మాట్లాడలేదు
అయినా సరే ఇంజనీరింగ్ చేస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఆరేళ్లపాటు ఇంట్లోవాళ్లు నాతో మాట్లాడలేదు. ఓసారి నాకు సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. ఈ విషయం నేను వాట్సాప్ గ్రూపులో పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత నేను కన్నడ బిగ్‌బాస్‌కు వెళ్లాను. నన్నెలాగో మార్చలేమని అర్థమయ్యాక చివరికి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. బాల్యంలో నా కలర్ గురించి చాలా మాటలన్నారు. బ్లాకీ అని, నల్లగా ఉన్నానని కామెంట్లు చేశారు. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలన్నా భయమేసేది.
ఎన్నో మాటలు పడ్డా
నువ్వు ఇంత నల్లగా ఉన్నావ్.. పెద్దయ్యాక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ముఖానికి క్రీముల్లాంటివి పూసుకోమని.. తెల్లగా కనిపించాలని చెప్పేవారు. నేను యక్షగానం చేసే ఆర్టిస్టును. యక్షగానం చేసేటప్పుడు నాలుగు లేయర్ల మేకప్ వేస్తారు. పది లేయర్ల డ్రెస్సు వేసుకుంటాం. అంత కష్టపడితే మా ప్రతిభను గుర్తించి పొగిడేవారు కాదు. పైగా ముఖానికి అలా రంగు పూసుకోవడం వల్ల ఇంకా నల్లగా అవుతున్నానని ఎగతాళి చేసేవారు. అలా ఎన్నో మాటలు పడ్డాను. వాటన్నింటికీ అధిగమించాను' అని చెప్పుకొచ్చింది భూమి శెట్టి.
చదవండి: ఈ నటికి ఇంటిపేరు లేదు, ఇండస్ట్రీలో అది భరించలేక సినిమాలకు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment