సన్నీ డియోల్, డింపుల్ కపాడియా
సన్నీ డియోల్, అమృతా సింగ్... జంటగా తెర మీద కనిపించడం కనిపించడంతోనే ప్రేమ పక్షులుగా ప్రేక్షకుల మనసుల్లో దాగుండి పోయారు. ఇద్దరూ ఒకరికొకరు.. సినీ అభిమానులకు ఒకేసారి పరిచయం.. ‘బేతాబ్’ చిత్రంతో. తెర మీదే కాదు తెర వెనకా వీళ్ల ప్రేమ కథ మొదలైంది ఆ సినిమా సెట్స్ మీదే.. 1983లో.
‘జబ్ హమ్.. జవా హోంగే.. జానే కహా హోంగే.. లేకిన్ జహా హోంగే.. పర్ యాద్ కరేంగే.. తుఝే యాద్ కరేంగే... (పెద్దయ్యాక మనం ఎక్కడుంటామో ... ఎక్కడున్నా.. నిన్ను గుర్తు చేసుకుంటా)’ బేతాబ్‌లో సూపర్ డూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను ఆ మూవీ షూటింగ్‌లోనే కాదు.. సినిమా పూర్తయ్యాకా పాడుకున్నారు సన్నీ డియోల్, అమృతాసింగ్ చేతిలో చేయి వేసుకొని. సన్నీ డియోల్ మ్యాన్లీనెస్‌కు మనసు పడేసుకుంది ఆమె. అమృత అమాయకత్వాన్ని మనసంతా నింపుకున్నాడు అతను. బేతాబ్ విడుదలయ్యేలోపే వీళ్ల ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీని చెవులు కొరుక్కునేలా చేసింది. బేతాబ్ హిట్‌తో ఈ జంటకు నిర్మాతల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే తర్వాత చిత్రం ‘సన్నీ’లోనూ ఈ ఇద్దరే నాయికానాయకులుగా ఖరారు అయ్యారు. ఆ సినిమా సెట్స్‌లోనూ వీళ్ల చనువు పదిమందినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ‘సన్నీ’ షెడ్యూల్స్‌లోనే మధ్యమధ్యలో లండన్ వెళ్లివస్తూండే వాడు సన్నీ. ఎందుకో ఎవరికీ తెలిసేది కాదు.. అమృతతో సహా. ఈలోపు ఆమె మీడియాకు ఎన్‌కౌంటర్ అయ్యేది. సన్నీతో ఆమె సాన్నిహిత్యం టాపిక్‌గా మారేది. ‘అవును.. మేం ప్రేమలో పడ్డాం..’ అని నిర్ధారించేసింది అమృత.
అందుకే వెళ్లాడు..
‘సన్నీ’ విడుదల అయింది. సన్నీ డియోల్, అమృతాసింగ్ జోడీకి మరింత క్రేజ్ పెరిగింది. మాటిమాటికీ సన్నీ డియోల్ లండన్ ఎందుకు వెళ్తున్నాడో మీడియా జాసూసీ చేసింది. ‘సన్నీ డియోల్‌కు పెళ్లయింది. భార్య లండన్లో ఉంటుంది. లండన్‌లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. పేరు పూజ’ అనే విషయాన్ని రాసింది. అది చదివిన అమృత షాక్ అయింది. సన్నీ డియోల్‌ను నిలదీసింది. ‘మీడియాలో వచ్చిందంతా అబద్ధం’ అన్నాడు. ‘మరి తడవ తడవకు లండన్ ఎందుకు వెళ్తున్నావ్?’ అని ప్రశ్నించింది. మౌనం వహించాడు సన్నీ. సహించలేకపోయింది అమృత. ఇన్నాళ్ల స్నేహం, ప్రేమంతా అబద్ధమేనా? పెళ్లి చేసుకొని అతనితో జీవితం పంచుకోవాలనుకుంది ఈ అబద్ధపు పునాదుల మీదనా? అంటూ మథన పడింది.
తనను తాను కోపగించుకుంది.. అరిచింది.. ఏడ్చింది. ఆ ఆవేశం, ఉక్రోషం అంతా తగ్గాక సన్నీతో అనుబంధాన్నీ తెంచేసుకోవాలనే నిశ్చయానికి వచ్చింది అమృత. తెంచేసుకుంది కూడా. మరుసటి క్షణం నుంచే కెరీర్ మీద దృష్టి పెట్టింది. అమృత వాళ్ల అమ్మ రుక్సానా సుల్తానా కూడా కూతురి నిర్ణయం పట్ల సంతోషించింది. సన్నీకి పెళ్లయిందని తెలిసీ మొండిగా అతణ్ణే పెళ్లి చేసుకుంటానని ఎక్కడ పట్టుపడుతుందో.. ఒకవేళ ఆ వ్యక్తి కుదరదు అంటే ఎక్కడ కుంగిపోతుందోనని ఆందోళన చెందింది రుక్సానా. జీవితంలో ముందుకుసాగాలని కూతురు డెసిషన్ తీసుకోవడంతో ఊపిరి పీల్చుకుంది ఆ తల్లి. ఇటు సన్నీ వాళ్లమ్మ ప్రకాశ్ డియోల్ కూడా ఆ ప్రేమ పట్ల వ్యతిరేకంగానే ఉండింది. ఎందుకంటే తన కొడుక్కి పెళ్లయిన విషయం ఆమెకు తెలుసు కదా!
రహస్యం ఎందుకు?
సన్నీ సినీ ప్రవేశం కంటే ముందే అతనికి పూజతో పెళ్లయింది. బిజినెస్ ఒప్పందాల ప్రకారం వివాహం జరిగిందని అంటారు ధర్మేంద్ర సన్నిహితులు. దాని తర్వాతే ‘బేతాబ్’ సినిమా ప్లాన్ చేశారు. లవ్ స్టోరీ. సన్నీకి పెళ్లయిందని తెలిస్తే తన కొడుకుకు రొమాంటిక్ హీరో ఇమేజ్ రాదేమోనని.. సినిమా హిట్ కాదేమోననే భయంతో ఆ నిజాన్ని ఇంటి గుమ్మం దాటనివ్వలేదు ఆ కుటుంబ సభ్యులు. సన్నీ కూడా తాను బ్యాచిలర్ అన్న భావనతోనే సెట్స్ మీదకు వచ్చాడు. అమృత ఆకర్షణలో పడిపోయాడు.
ఆగలేదు..
బ్రేకప్ తర్వాత ఇద్దరి జీవితాలూ ఆగిపోలేదు. అమృత.. ప్రముఖ క్రికెటర్ రవిశాస్త్రి ప్రేమలో పడింది. సన్నీ.. డింపుల్ కపాడియాను ప్రేమించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఉన్న సినిమా లిస్ట్‌లోనూ హిట్లకేం తక్కువ లేదు. రాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలో (ఆమె చెల్లెళ్లు, తమ్ముడు చనిపోయినప్పుడు) ఆమెకు అండగా నిలబడ్డాడు. అయితే ఈ విషయం సన్నీ భార్య పూజకు తెలిసి ‘డింపుల్‌తో స్నేహం కట్ చేసుకోకపోతే పిల్లల్ని (ఇద్దరబ్బాయిలు) తీసుకొని ఇల్లు వదిలివెళ్లిపోతా’ నని హెచ్చరించింది. ‘తండ్రి (హేమమాలినిని పెళ్లి చేసుకొని)లా ధైర్యం చేయలేకపోయాడు సన్నీ. అలాగని పూజ మాటకూ గౌరవం ఇవ్వలేదు. డింపుల్‌తో రిలేషన్‌ను బ్రేక్ చేసుకోలేదు’ అంటారు ఇండస్ట్రీలో వాళ్లు. ఇప్పటికీ సన్నీ, డింపుల్ రిలేషన్‌లోనే ఉన్నారు అని చెప్తారు వాళ్లు.
ఇప్పుడు అమృతానే ఒంటరి.
‘యే బచ్‌పన్ కా ప్యార్ అగర్ ఖో జాయేగా.. దిల్ కిత్నా ఖాలీ ఖాలీ హో జాయేగా.. తేరే ఖయాలోమే ఇసే ఆబాద్ కరేంగే.. తుఝే యాద్ కరేంగే (బాల్యంలోని ఈ ప్రేమను పెద్దయ్యాక పొందలేకపోతే మనసంతా ఖాళీ అయిపోతుంది.. నిన్ను గుర్తు చేసుకుంటూ.. నీ జ్ఞాపకాలతో మనసును నింపుకుంటా)’ అన్న చరణం జబ్ హమ్ జవాహోంగే పాటలోనిదే. ఈ చరణాన్ని పాడుకునే అవకాశం సన్నీకి రానట్టుంది.. అమృత ఆ అవకాశాన్ని రానివ్వనట్టుంది.
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment