
సతీమణుల సమేతంగా సూర్య, పృథ్వీరాజ్
తమిళ సినిమా: కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో రాణిస్తున్నారు. అలాగే విజయపథంలో దూసుకుపోతున్న నిర్మాతగా కూడా గుర్తింపుపొందారు. 2డీ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 42వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా సూర్య, పృథ్వీరాజ్ సుకుమారన్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వారు తమ సతీమణులతో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు స్టార్లు కలవడానికి కారణం ఓ భారీ చిత్రంలో నటించడానికి అనే ప్రచారం సాగుతోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్, సూర్య జ్యోతికల 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి ఒక చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. అయితే వీరిద్దరూ కలిసి ఓ భారీ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రముఖ బ్రిటానియా బిస్కెట్ అధినేత రాజన్ పిళ్‌లై బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు, అందులో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనికి సరిగమ ఇండియా సంస్థ సహ నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ ఆనంద్ కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన కథ సిద్ధమవుతోందని తెలిపారు. అయితే ఇది సినిమాగా తెరకెక్కుతుందా, లేక వెబ్ సిరీస్‌గా రూపొందుతుందా? అన్న విషయం గురించి స్పష్టత లేదు. అదేవిధంగా ఇందులో నటిస్తారా, లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment