
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఎంతటి హింసాత్మకంగా మారాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ముసుగు ధరించిన దుండగులు కొందరు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో జనవరి 7న బాధిత విద్యార్థులకు సంఘీభావంగా బాలీవుడ్ అగ్రతార దీపిక పదుకొనే జేఎన్‌యూకు వెళ్లారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. జేఎన్‌యూను సందర్శించడానికి ఆమె 5 కోట్ల రూపాయలను తీసుకుందంటూ ట్విటర్‌లో ప్రచారం జరుగుతోంది. (వివాదాస్పద సన్నివేశంపై స్పందించిన నటి)
దీనిపై బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ స్పందించారు. ఇది పూర్తిగా అర్థం పర్థం లేని తప్పుడు సమాచారమని సదరు వార్తలను కొట్టిపారేశారు. "జేఎన్‌యూలో రెండు నిమిషాలు ఉన్నందుకే దీపిక ఐదు కోట్లు తీసుకుంది. కానీ స్వర భాస్కర్ ఏడాదిగా సీఏఏ కోసం వ్యతిరేకంగా అరిచి గీపెడుతున్నా కేవలం వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని మాత్రమే సంపాదించింది. దేవుడా... మనుషులకు నిరాశను ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ కమ్యూనిజాన్ని మాత్రం ఇవ్వకయ్యా" అని ఓ ట్విటర్ యూజర్ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దీనికి స్వర ఘాటుగా రిప్లై ఇస్తూ.. "బాలీవుడ్ గురించి తప్పుగా రాసే ఇలాంటి చెత్త వార్తలను ఎలా నమ్ముతారు అసలు? ఇంతకు మించిన మూర్ఖత్వం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (జేఎన్‌యూలో దీపిక)
Comments
Please login to add a commentAdd a comment