తమిళ అగ్రహీరోలు విజయ్, అజిత్ చిత్రాల మధ్య ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొంది. విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నటి రష‍్మిక మందన్నా కథానాయకి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించారు. అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తునివు. మలయాళ నటి మంజు వారియర్ హిరోయిన్‌గా చేసిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. జి.సినిమా సంస్థతో కలిసి బోనీకపూర్ నిర్మించారు. దీనికి అనిరుద్ సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పొంగల్ బరిలో ఢీకొనడానికి సిద్ధమవుతున్నాయి.
వారిసు కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఉంటుందని ఆ చిత్ర వర్గాలు చెబుతుంటే, తునివు చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలు రావడం సహజమే అయినా, అజిత్, విజయ్ ఇద్దరికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండడం, నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా భావించడం, వీరి చిత్రాల మధ్య అంచనాలు వీటికి కారణాలుగా చెప్పొచ్చు. కాగా అజిత్ నటించిన తునివు చిత్ర విడుదల హక్కులను నటుడు, నిర్మాత, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం.
ఒకేరోజు రెండు చిత్రాలు విడుదల..!
విజయ్ వారిసు చిత్రాన్ని చెన్నై, కోయంబత్తూర్, ఉత్తర ఆర్కాడ్, దక్షిణ ఆర్కాడ్ ఏరియాల్లో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థనే విడుదల చేయనుంది. మిగిలిన ఏరియాలను మాస్టర్ చిత్ర సహ నిర్మాత లలిత్ విడుదల చేయనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ రెండు చిత్రాలను ఒక రోజు అటు ఇటుగా విడుదల చేస్తారని డిస్టిబ్యూటర్లు భావించారు. వారిసు చిత్రాన్ని 12వ తేదీ విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో తునివు చిత్రాన్ని 11వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు వారిసు చిత్రాన్ని కూడా 11వ తేదీ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఈగో కారణంగానే ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. విజయ్ చిత్రం ఆడియో ఆవిష్కరణను ఇటీవల చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ జనవరి ఒకటో తేదీ దీన్ని ప్రసారం చేసింది. ఆ తర్వాత చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. కాగా అజిత్ నటించిన తునివు చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు చేయలేదు. అంతేకాదు చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు.
తలలు పట్టుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు
దీనికి అజిత్ మేనేజర్ మంచి చిత్రానికి పబ్లిసిటీ అవసరం లేదంటూ ఒక స్టేట్‌మెంట్ కూడా విడుదల చేశారు. అయితే తునివు చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఊర మాస్‌గా ఉన్న ఈ చిత్రం ట్రైలర్ అజిత్ అభిమానులకు పిచ్చ పిచ్చిగా నచ్చేసింది. దీంతో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకపోయినా తుణివు చిత్ర ట్రైలర్, వారిసు చిత్రం కంటే ఎక్కువ లైకులు పొందుతోందంటూ ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే వారిసు, తునివు చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతుండడంతో ఏ చిత్రానికి ఎన్ని థియేటర్లు కేటాయించాలి, దేనికి మార్నింగ్ షోలు వేయాలి? ఏ హీరో అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అని డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు.
ఈ చిత్రాల విడుదల విషయంలో సినిమా పెద్దలు చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారిసు, తునివు చిత్రాల టికెట్లను రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్‌లో విక్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం టికెట్ రూ.190కి మించరాదని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు చిత్రాలు మరో నాలుగు రోజుల్లో భారీ అంచనాల మధ్య తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. మరి ఏ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment