ఏ భాష తీసుకున్నా సరే హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సరిగ్గా తీయాలే గానీ హిట్ కొట్టడం పక్కా. ఈ మధ్య కాలంలో 'మసూద', 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర' తదితర చిత్రాలు ఇలాంటి కథలతో వచ్చి అందర్ని భయపెట్టాయి. ఇప్పుడు అలాంటి కథతో తీసిన మూవీ 'తంత్ర'. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అనన్య నాగళ్ల భయపెట్టిందా? హిట్ కొట్టిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
రేఖ(అనన్య నాగళ్ల)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజూ (ధనుష్ రఘుముద్రి)ని ఇష్టపడుతుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో విగత ('టెంపర్' వంశీ), రాజేశ్వరి (సలోని) ఎవరు? వీళ్లకు రేఖకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే?
హారర్ సినిమాల్లో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. భయపెట్టే, వణుకు పుట్టించే సీన్స్ కచ్చితంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. 'తంత్ర' విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డారు. చూస్తున్నంత సేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. సరికదా బోర్ కొడుతుంది.
'తంత్ర' సినిమాలో రక్త దాహం, పాతాళ కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి.. అని ఆరు భాగాలు ఉంటాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్లస్ కాలేదు. ఈ పేర్లు లేకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏం ఉండేది కాదు. తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. భయపెడితే చాలు. కానీ దర్శకుడు.. వాటి గురించి ఒక్కోటి వివరించుకుంటూ వెళ్లడం సాగదీతగా అనిపించింది. దీంతో 'తంత్ర'.. సీరియల్ కంటే స్లోగా సాగింది.
సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే ఓ సీన్‌తో మొదలవుతాయి. 'తంత్ర'లో అలాంటిదేం లేకుండా చాలా ఫ్లాట్‌గా స్టోరీ వెళ్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. 'మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు' అని.. మూవీ రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. కాకపోతే ఒకటి రెండు సీన్లు తప్పితే పెద్దగా హారర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే ఇది కాదు.
ఎవరెలా చేశారు?
రేఖగా ప్రధాన పాత్ర చేసిన అనన్య నాగళ్ల ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఈమెకి తగ్గ సీన్స్ పడలేదు. క్లైమాక్స్‌లో కాస్త స్కోప్ దక్కింది. తేజూగా చేసిన ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాజేశ్వరిగా ప్రత్యేక పాత్ర చేసిన సలోని.. ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. కానీ ఆ పాత్రని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. మిగతా పాత్రధారులు తమ ఫరిది మేరకు నటించారు.
దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. కాకపోతే పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్‌పైకి తీసుకొచ్చేసరికి అనుభవలేమి కనిపించింది. క్షుద్రపూజాల నేపథ్యంలో క్యూరియసిటీ పాయింట్ రాసుకున్నప్పటికీ.. తీసే విషయంలో తడబడ్డారు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్.. పాటలు, నేపథ్య సంగీతం పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి. అలా అని పూర్తి బాగోలేవని కూడా కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'తంత్ర'.. ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment