సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నిర్మాతల మండలి సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లతో ఫిలిం చాంబర్లో నిర్మాతల మండలి భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కాగా, షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. తమ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనేది అవాస్తవమన్నారు. ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో కొత్త సినిమాలు వంటి అంశాలు నిర్మాతల మండలి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఓటీటీ, వీపీఎఫ్ చార్జెస్, టిక్కెట్ ధరలు, నిర్వహణ వ్యయం వంటి అంశాలపై ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సి. కళ్యాణ్ , సునీల్ నారంగ్ , స్రవంతి రవికిశోర్, సుప్రియ, దర్శకుడు తేజ, వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా.. భేటీకి ముందు తెలుగు ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్ రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటీటీల వల్ల థియేటర్లు, డిస్ట్రీబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పెద్ద సినిమాలను 8 వారాలు, చిన్న సినిమాలు 4 వారాల తర్వాతే ఓటీటీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 14 ఏళ్ల నుంచి అమలవుతున్న డిజిటల్ ఛార్జీలను యధాతథంగా కొనసాగించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్ల విక్రయం జరపాలన్నారు. రెంటల్ విధానంలో మార్పులు చేసి ఆక్యుపెన్సీలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ జూమ్ మీటింగ్ తమ డిమాండ్లను తెలియజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment