అమ్మాయిలంటే సిల్వర్ స్క్రీన్‌పై మెరవడానికే.. స్క్రీన్ వెనక టెక్నీషియన్స్‌గానో, సినిమాలకు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌గా సూట్ అవ్వరనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకే ఈ రెండు విభాగాల్లో తక్కువమంది ఉంటారు. అయితే రోజులు మారుతున్నాయి. మహిళా సాంకేతిక నిపుణులు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య పెరిగింది. అరడజను మందికి పైగా ఈ ఏడాది నిర్మాతలుగా పరిచయం కావడం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పువచ్చు. ఇక ఈ ఏడాది ఫిలిం మేకింగ్ (నిర్మాణం)లోకి వచ్చిన మేడమ్స్ గురించి తెలుసుకుందాం.
దివంగత ప్రముఖ నటులు, నిర్మాత కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీద ‘రాధేశ్యామ్’ సినిమాతో ఈ ఏడాది నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)లతో కలిసి ప్రసీద (గోపీకృష్ణా మూవీస్) ఈ సినిమా నిర్మించారు. నిర్మాణరంగంలోకి అడుగు పెట్టక ముందు విదేశాల్లో ప్రసీద ప్రొడక్షన్ కోర్స్‌లో చేశారు. మరోవైపు దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కోడి దివ్య ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మించిన తొలి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, సంజన జంటగా నటించారు. తండ్రి దర్శకత్వం వహించిన చిత్రాల షూటింగ్‌లకు దివ్య వెళ్లేవారు. అలా ఫిలిం మేకింగ్‌పై అవగాహన పెంచుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా మారారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’ సినిమాకు నీలిమ ఓ నిర్మాత. ఈ ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక నిర్మాణరంగంలో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రాలకు (సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం..) పదికిపైగా జాతీయ అవార్డులు వచ్చాయి.
ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు. శ్రీజ ఎంటర్‌టైన్మెంట్స్‌పై రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. కాగా ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. ఆయన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాణరంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ కూడా ఆరంభమైంది. ఈ సిరీస్‌కు దర్శకుడు హరీష్ శంకర్ కథ ఇచ్చారు. బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌కి హన్షిత రెడ్డి ఓ నిర్మాతగా ఉన్నారు.
యాక్షన్ టు ప్రొడక్షన్
హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారు తుంటారు. హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ నిర్మాతగా మారారు. రాహుల్ విజయ్, మేఘా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మాటే మంత్రము’ చిత్రానికి బిందు ఆకాష్ ఓ నిర్మాతగా ఉన్నారు. పేరు తల్లిది అయినప్పటికీ కూతురు మేఘా ఆకాష్ సపోర్ట్‌తోనే బిందు నిర్మాత అయ్యుంటారని ఊహించవచ్చు. ఇక మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి ‘గార్గి’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
హిందీలోనూ..
బాలీవుడ్‌లోనూ ఈ ఏడాది లేడీ నిర్మాతల జాబితాలో కొందరు హీరోయిన్ల పేర్లు చేరాయి. హన్సల్ మెహతా తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో నటించి, నిర్మించనున్నారు కరీనా కపూర్. ఏక్తా కపూర్‌తో కలిసి ఆమె ఈ సినిమా నిర్మించనున్నారు. ఇక షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఆలియా భట్ ‘డార్లింగ్స్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఆలియా నటించారు కూడా. హీరోయిన్ కృతీ కుల్హారి కూడా ‘నాయిక’ అనే సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాణ రంగంలోనూ స్త్రీ శక్తి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
Comments
Please login to add a commentAdd a comment