చల్​ చల్​ చలో.. షూటింగ్​ చేద్దాం చలో.. అంటున్న హీరోలు | Tollywood Heroes Back To The Regular Shooting | Sakshi
Sakshi News home page

చల్​ చల్​ చలో.. షూటింగ్​ చేద్దాం చలో.. అంటున్న హీరోలు

Published Sat, Feb 5 2022 10:18 AM | Last Updated on Sat, Feb 5 2022 11:07 AM

Tollywood Heroes Back To The Regular Shooting - Sakshi

కరోనా వ్యాప్తి కారణంగా ఆ మధ్య కొందరు స్టార్ల సినిమా షూట్‌కి బ్రేక్‌ పడింది. సంక్రాంతి పండగ బ్రేక్‌ కూడా తోడైంది. ఇప్పుడు బ్రేక్‌లు తీశారు.. మేకప్‌ వేద్దాం.. షూటింగ్‌ చేద్దాం.. చలో.. చలో అంటూ స్టార్స్‌ షూట్‌లో పాల్గొంటున్నారు.

గత నెల చివర్లో చిరంజీవి కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉన్నారు. స్వల్ప లక్షణాలతో కరోనా ఆయన్ను ఇబ్బందిపెట్టలేదు. త్వరగానే నెగటివ్‌ వచ్చేసింది. దాంతో ఒకవైపు మోహన్‌ రాజా దర్శకత్వంలో చేస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’, మరోవైపు మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘బోళా శంకర్‌’ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్‌ చేసుకున్నారు చిరంజీవి. శుక్రవారం ‘గాడ్‌ ఫాదర్‌’ షూట్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ షూటింగ్‌ జరుగుతోంది. మరో పది రోజుల్లో ‘బోళా శంకర్‌’ కూడా ఆరంభమవుతుందని తెలిసింది. 

అలాగే ప్రభాస్‌ కూడా హైదరాబాద్‌లోనే షూట్‌తో బిజీగా ఉన్నారు. ‘ఆదిపురుష్‌’ ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’.. ఇవి ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాలు. ‘ఆదిపురుష్‌’ పూర్తయింది. ‘సలార్‌’ కొన్ని షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇటీవల వెకేషన్‌ నిమిత్తం యూరోప్‌ వెళ్లొచ్చిన ప్రభాస్‌ ప్రస్తుతం ‘సలార్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇక రవితేజ అయితే ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాలకు తన డైరీలో చోటిచ్చేశారు. ‘ఖిలాడీ’గా ఈ నెల 11న థియేటర్స్‌లోకి రానున్నారు. మిగతా చిత్రాల షూట్‌ని పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘రావణాసుర’ షూట్‌లో ఉన్నారు రవితేజ. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. 

హైదరాబాద్‌లోనే షూట్‌తో బిజీగా ఉన్న మరో హీరో రామ్‌. లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ హీరోగా రూపొందుతున్న ‘ది వారియర్‌’ చిత్రీకరణ జరుగుతోంది. కొందరు స్టార్స్‌ హైదరాబాద్‌లో చిత్రీకరణతో బిజీగా ఉంటే నాగచైతన్య కొన్నాళ్లుగా రష్యాలో ఉన్నారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ఈ హీరో నటిస్తోన్న ‘థ్యాంక్యూ’ షూటింగ్‌ శుక్రవారం వరకూ అక్కడ జరిగింది. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తయింది. ఇక ముంబైలో ‘లైగర్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ శుక్రవారం ముంబైలో ఆరంభమైంది. ఈ హీరోలే కాదు... మరికొందరు కూడా జోరుగా షూట్‌లో పాల్గొంటున్నారు.

ఈ నెలలోనే పక్కా..

ఈ నెలలో మరో పదీ ఇరవై  రోజుల్లో షూటింగ్‌లో పాల్గొననున్నారు బాలకృష్ణ, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించనున్న చిత్రం షూట్‌లో ఈ నెల మూడో వారం నుంచి బాలకృష్ణ పాల్గొంటారని తెలిసింది. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే మహేశ్‌ పాల్గొనడంలేదు. మరో నాలుగు రోజుల్లో మహేశ్‌ ఈ షూట్‌లో అడుగుపెడతారు. శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూట్‌లో ఈ నెల 10 నుంచి రామ్‌చరణ్‌ పాల్గొంటారని తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement