2024 సంవత్సరంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపథ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. పెద్ద హీరోల సినిమాల నుంచి ఊహించని హిట్ల వరకు వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులు ఆస్వాదించారు. కొన్ని సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమైనా.. మరి కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలను నిశితంగా పరిశీలిద్దాం.
టిల్లు స్క‍్వేర్ టూ పొట్టేల్..
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన "టిల్లు స్క్వేర్" బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల మీద వచ్చిన చిత్రం "రజాకార్". మొదటి రోజే మంచి టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.
ఆ తర్వాత ఇటీవల తెలంగాణ పెళ్లి నేపధ్యంలో వచ్చిన మరో చిత్రం "లగ్గం". థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అనన్య నాగళ్ల కీ రోల్ ప్లే చేసిన మరో డిఫెరెంట్ మూవీ పొట్టేల్. విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రజల్లోకి వెళ్లిన "పొట్టేలు" బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది.
అంతేకాకుండా జితేందర్ రెడ్డి , ఉరుకు పటేలా , లైన్ మాన్ , ప్రవీణ్ ఐపీఎస్ , కళ్లు కాంపౌండ్ ,పైలం పిలగా, షరతులు వర్తిస్తాయి, గొర్రెపురాణం , బహిర్ భూమి , కేశవ చంద్ర రమావత్ ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఈ చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇన్ని సినిమాలు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కథ, కథనాలు రొటీన్‌గా ఉండడం, మేకింగ్ నాసిరకంగా ఉండటం, నిర్మాణ విలువలు లేకపోవడంతో చాలా సినిమాలు చతికిలపడ్డాయి.
అయితే అటు ఓటీటీల్లోను తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రముఖ గాయని సునీత కొడుకు హీరోగా, దర్శక ధీరుడు కె రాఘవేంద్రరావు గారి సమ్పర్పణలో వచ్చిన సర్కారు నౌకరి ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే థియేటర్లో హిట్ టాక్‌తో ఓటీటీలోకి వచ్చిన "లగ్గం" చిత్రం ఆహా, అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అటు తెలుగులో మాత్రమే కాకుండా తమిళం , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. పెద్ద హీరో చిన్న హీరో అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే థియేటర్లో కాకుండా ఓటిటిల్లో సక్సెస్ సాధిస్తున్నాయి.
2024లో టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్ రామ్, రజాకర్ దర్శకుడు యాట సత్యనారాయణ, లగ్గం సినిమా దర్శకుడు రమేశ్ చెప్పాల, మంచి పేరు సాధించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. 2025లో కూడా తెలంగాణ నేపథ్యంలో మరిన్ని హిట్ సినిమాలు రావాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment