విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకథకు డేట్ సెట్ అయింది. సన్నాఫ్ ఇండియా చేసిన పోరాటం చూసే డేట్ సెట్ అయింది. కరోనా కరుణిస్తే పక్కా కమర్షియల్ చూసే డేట్ సెట్ అయింది. ఇంతేనా... ఇంకా బుధవారం బోలెడన్ని డేట్స్ సెట్ అయ్యాయి. పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, హిందీ చిత్రాల రిలీజ్ డేట్ సెట్ అయింది. ఇక ప్రేక్షకులు ఏ రోజు సినిమా చూడాలో... డేట్ సెట్ చేసుకోవడమే ఆలస్యం.
విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకావ్యంగా రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే జంటగా ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథాగా ఈ చిత్రం రూపొందింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ నెలలోనే ‘సన్నాఫ్ ఇండియా’ తెరపైకి వచ్చే తేదీ షురూ అయింది. సమాజాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేసే పవర్‌ఫుల్ వ్యక్తిగా మోహన్‌బాబు టైటిల్ రోల్ చేసిన చిత్రం ఇది. ఈ సినిమాకు మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌తో కలసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
మరోవైపు మూడు నెలల తర్వాత రానున్న డేట్‌ని ‘పక్కా కమర్షియల్’ టీమ్ ప్రకటించింది. కరోనా కరుణిస్తే... అనుకున్న తేదీకి పక్కాగా వస్తాం అంటూ ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. గోపీచంద్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్ కూడా ఖరారైంది.
మార్చి 4న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా తెరకు రానుంది. ఈ తేదీని ప్రకటించి, టీజర్‌ని రిలీజ్ చేశారు. మూడు పదుల వయసున్న అర్జున్ కుమార్‌కి పెళ్లి ఎందుకు కాలేదు? చివరకి పెళ్లి కోసం అర్జున్ కుమార్ అండ్ ఫ్యామిలీ ఏం చేశారు? అనే విషయాలతో ఈ సినిమా సాగుతుంది. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ చిత్రదర్శకుడు రవి కిరణ్ కోలా కథ–మాటలు–స్క్రీన్‌ప్లే అందించారు.
ఇక ఫిబ్రవరి 18న విడుదలకు రెడీ అయిన సినిమా ‘సురభి 70 ఎంఎం’ (హిట్టు బొమ్మ ). గంగాధర వై.కె. అద్వైత దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్, సినిమా థియేటర్‌ని కాపాడుకోవాలి అనే కథతో గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. బాబీ ఫిలిమ్స్ సమర్పణలో కేకే చైతన్య నిర్మించిన ఈ చిత్రంలో అక్షత శ్రీనివాస్, వినోద్, అనిల్, చందు, మహేశ్, ఉషాంజలి, శ్లోక తదితరులు నటించారు. ఆచార్య ఏప్రిల్ 29, సర్కారు వారి పాట మే 12కు రిలీజ్ అవుతున్నాయి.
హిందీలోనూ...
బాలీవుడ్‌లోనూ రిలీజ్‌ల హడావిడి కనబడుతోంది. ఆలియా భట్ టైటిల్ రోల్ చేసిన ‘గంగూబాయి కతియావాడి’ ఈ నెల 25న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన ‘ఝుంద్’ మార్చి 4న, ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘అనేక్’ మే 13న, కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్ భులెయ్యా 2’ మే 20న రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇంకా రిలీజ్ లిస్ట్‌లో పలు చిత్రాలు ఉన్నాయి.
కోలీవుడ్‌లోనూ...
తమిళ పరిశ్రమ కూడా సినిమా విడుదల తేదీలను ఖరారు చేసుకుంటోంది. రిలీజ్ కానున్న చిత్రాల్లో అజిత్ కుమార్ ‘వలిమై’, సూర్య ‘ఎదర్కుమ్ తునిందవన్’ ఉన్నాయి. అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘వలిమై’ ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ అనువాదరూపంలో అదే తేదీన ఈ చిత్రం తెరకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయడం విశేషం.
ఇక ఈ కరోనా కాలంలో సూర్య హీరోగా నటించిన రెండు చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యాయి. అది సూర్య ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరిచింది. అయితే సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎదర్కుమ్ తునిందవన్’ చిత్రం థియేటర్స్‌లో రానుండటం వారికి ఆనందాన్నిచ్చే విషయం. మార్చి 10న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అనువదించి, అదే తేదీన విడుదల చేయనున్నారు.
డబుల్ డేట్!
ఒక పని చేయడానికి ఓ ప్లాన్ అనుకుంటాం. అది ప్లాన్ ‘ఎ’. ఆ ప్లాన్ ప్రకారం జరగకపోతే అనే ఆలోచనతో ప్లాన్ ‘బి’ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు తెలుగులో ‘ప్లాన్ బి’ ట్రెండ్ నడుస్తోంది. సినిమా రిలీజ్‌కి ‘డబుల్ డేట్’ ప్రకటించి, ఆ తర్వాత ఓ డేట్‌కి ఫిక్స్ అవుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు. ఓ పది రోజుల క్రితం ‘‘మా ‘ఆర్‌ఆర్‌ఆర్’ని ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తాం’’ అని ఈ చిత్రబృందం ప్రకటించింది. చివరికి మార్చి 25న విడుదల చేయనున్నట్లు సోమవారం ఓ తేదీని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ తరహాలోనే ‘భీమ్లా నాయక్’ రెండు విడుదల తేదీలను ప్రకటించింది. పవన్ కల్యాణ్–రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. లేకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని సోమవారం ప్రకటించారు. మంగళవారం రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’, వరుణ్ తేజ్ ‘గని’.. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ‘డబుల్ డేట్’ ప్రకటన వచ్చింది.
రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘‘మార్చి 25న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మార్చి 25 కుదరకపోతే ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్‌లో ఫిబ్రవరి 25 కూడా ఉంది. ఆ చిత్రం ఫిబ్రవరి 25కి రాకపోతే అదే రోజున ‘గని’ విడుదలవుతుంది.. ‘భీమ్లా నాయక్’ 25నే రిలీజ్ అయితే ‘గని’ మార్చి 4న రిలీజవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment