కొన్ని సినిమాలు మ్యాజిక్ చేస్తాయి. ఎంతటి కఠిన హృదయాలనైనా కదిలించేస్తాయి. సినిమా చూసిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయి. అలాంటి సినిమానే 12th ఫెయిల్. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. హాట్‌స్టార్‌లోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. 'వంద రోజులు వెనక్కు వెళ్తే ఆ రోజు ఈ సినిమా తొలిసారి స్క్రీనింగ్ వేశాం.
12th ఫెయిల్ ఎవరూ చూడరన్నారు
అప్పుడు బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు, రూ.500 కోట్లు, రూ.1000- 2000 కోట్ల గురించి మాట్లాడుకుంటున్న రోజులు.. నేను అందులో కొంతైనా రాబడతానా? అనుకున్నాను. అయినా ఈ సినిమా తీయడం వెనక నా ఉద్దేశ్యమేంటి? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. మనం నిజాయితీగా సినిమా తీస్తే కలెక్షన్లు వాటంతటవే వస్తాయని నమ్మాను. అయితే 12th ఫెయిల్ చూసేందుకు ఎవరూ థియేటర్స్‌కు రారని చాలామంది భయపెట్టారు. అందులో నా భార్య(అనుపమ చోప్రా) కూడా ఒకరు. విక్రాంత్, నువ్వు కలిసి చేసిన ఈ సినిమాను ఎవరూ చూడరు.
రూ.30 లక్షల కంటే ఎక్కువ రావన్నారు
నేనైతే ఇలాంటి సినిమాలకు కనెక్ట్ అవను. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసుకో అని చెప్పింది. కొందరైతే ఈ మూవీ ఓపెనింగ్‌కు రూ.2 లక్షలు వస్తాయి. ఓవరాల్‌గా రూ.30 లక్షలు రాబడితే అదే గొప్ప అని రాసేశారు. చాలా భయపెట్టారు. కానీ నేను ఈ సినిమాను నమ్మాను. నా నమ్మకం వమ్ము కాలేదు. 12th ఫెయిల్ అందరినీ ఆకట్టుకుంది' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో విక్రాంత్ మాస్సే మనోజ్‌గా నటించాడు. మనోజ్ భార్య, ఐఆర్‌ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ మెప్పించింది. దాదాపు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అరవై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ
Comments
Please login to add a commentAdd a comment