టీనేజ్‌లో ఏది ప్రేమ? ఏది అట్రాక్షన్ అని తెలుసుకోవడం చాలా కష్టం.. ఎంతోమంది అట్రాక్షన్‌నే ప్రేమ అనుకుని ముందుకు వెళ్తుంటారు. తీరా కొంతకాలానికే ఆసక్తి తగ్గిపోయి బ్రేకప్ చెప్పుకుంటారు. అలా గతంలో తాను కూడా ప్రేమలో పడి పెద్ద గుణపాఠం నేర్చుకున్నానంటోంది హీరోయిన్ విద్యాబాలన్. 'కాలేజీలో ఉన్నప్పుడు తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించాను. అతడు పెద్ద పోకిరి అని తర్వాత అర్థమైంది. మేము బ్రేకప్ చెప్పుకున్నాక వాలంటైన్స్ డే రోజు అనుకోకుండా నాకు తారసపడ్డాడు. అతడు నన్ను చూసి.. నేను నా మాజీ ప్రియురాలితో డేట్‌కు వెళ్తున్నాను అని చెప్పాడు.
తొలినాళ్లలో ఎన్నో కష్టాలు
అది విని షాకయ్యాను. నాకు పిచ్చెక్కినట్లయింది. ఇలాంటివాడినా ప్రేమించాను అనుకుని బాధపడ్డాను. తర్వాత నేను కూడా కొందరిని ప్రేమించాను. కానీ ఎవరితోనూ డీప్ రిలేషన్‌కు వెళ్లలేదు. తొలిసారి సీరియస్‌గా, గాఢంగా ప్రేమించిన వ్యక్తి సిద్దార్థే.. అతడినే నేను పెళ్లి చేసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. సినిమాల్లో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ.. 'తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాను. ఆ సమయంలో నా హృదయం ఎన్నిసార్లు ముక్కలైందో!
ప్రతిరోజూ ఏడుపే
నన్ను రిజెక్ట్ చేస్తుంటే తట్టుకోలేకపోయేదాన్ని.. ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ నిద్రపోయేదాన్ని.. ఇక నావల్ల కాదని చేతులెత్తేసేదాన్ని. కానీ తెల్లారి మళ్లీ సినిమా గురించే ఆలోచించేదాన్ని. ఒకసారి మోహన్‌లాల్‌తో నేను చేస్తున్న సినిమాను పక్కనపడేశారు. అప్పుడు నా చేతిలో ఉన్న మలయాళ సినిమా కూడా ఆపేశారు. దీంతో అందరూ నన్ను ఐరన్ లెగ్ అని పిలిచారు. నిజంగానే అంత దురదృష్టవంతురాలినా? అని నాలో నేనే కుమిలిపోయేదాన్ని.
'ఐరన్ లెగ్'గా ముద్ర
ఐరన్ లెగ్ అనే పదం వల్ల చాలామంది నిర్మాతలు నన్ను సినిమాలో తీసుకున్నట్లే తీసుకుని పక్కనపెట్టేశారు. డజన్లకొద్దీ సినిమాల్లో నాకు బదులుగా వేరే హీరోయిన్లను తీసుకున్నారు. ఒక నిర్మాత అయితే నేను దురదృష్టవంతురాలిని అని చూసేందుకు కూడా ఇష్టపడలేదు. అసలు నా ముఖం హీరోయిన్‌లా ఉందా? అని నా పేరెంట్స్‌తో అన్నాడు. అప్పుడు ఆరునెలల దాకా నా ముఖం అద్దంలో చూసుకోలేదు. లగే రహో మున్నా భాయ్ సినిమా చేశాక అదే నిర్మాత నన్ను తన సినిమా చేయమని అడిగాడు' అని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment