సుశాంత్ కేసు: రాములమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు | Vijayashanthi Interesting Comments On Sushant Singh Rajput Case | Sakshi
Sakshi News home page

సుశాంత్ కేసు: విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, Sep 4 2020 7:24 PM | Last Updated on Fri, Sep 4 2020 7:27 PM

Vijayashanthi Interesting Comments On Sushant Singh Rajput Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్శన్ విజయశాంతి ఆసక్తికరమైర రీతిలో స్పందించారు. సినీ పరిశ్రమలకు చెందిన ఎంతోమంది నటీమణులు అనుమానాస్పద రీతిలో మరణించారని వారి మరణంపై ఏనాడైనా సరైన దర్యాప్తు చేశారా అని ప్రశ్నించారు. మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశామని పేర్కొన్నారు. దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. (కీలక విషయాలు వెల్లడించిన సుశాంత్‌ సోదరి)

ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌ వ్యక్తిగత ఖాతా నుంచి విజయశాంతి ఓ పోస్ట్‌ చేశారు. ‘సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ... మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు... దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. (డ‌బ్బు, జ‌బ్బు గురించి సుశాంత్ టెన్ష‌న్‌)

అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ.. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా... వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి.’ అని విజయశాంతి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement