టైటిల్: విరూపాక్ష
నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ తదితరులు
నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్
నిర్మాత: బీవీఎస్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ దండు
స్క్రీన్‌ప్లే: సుకుమార్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేది: ఏప్రిల్ 21, 2023
రోడ్డు ప్రమాదం తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే తొలి హారర్ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం, ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్,ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 21) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
విరూపాక్ష కథేంటేంటే
ఈ సినిమా కథంతా రుద్రవనం అనే గ్రామంలో జరుగుతుంది. 1979లో క్షుద్ర పూజలు చేస్తూ చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారనే నెపంతో ఓ జంటను కొట్టి చంపుతారు గ్రామస్తులు. అది జరిగిన పుష్కరకాలం తర్వాత సూర్య(సాయి ధరమ్ తేజ్) తన తల్లితో కలిసి ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో జాతర జరుగుతుండడంతో 15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర(రాజీవ్ కనకాల) కూతురు నందిని(సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.
అదే సమయంలో రుద్రవనం గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తాయి. అందులో సూర్య పెదనాన్న కూతురు పార్వతి(యాంకర్ శ్యామల) కూడా ఉంటుంది. అనుమానాస్పద మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఊరి ప్రజలంతా భయంతో వణికిపోతారు. చేతబడి కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని పూజారి (సాయిచంద్) ఊరినంతా అష్టదిగ్బంధనం చేయిస్తారు. అసలు ఆ ఊరిని పట్టిపీడుస్తున్న ఆ దుష్టశక్తి ఏంటి? చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రేమించిన అమ్మాయి నందినిని రక్షించుకోవడం కోసం సూర్య ఎం చేశాడు? ఆ మిస్టరీ డెత్స్ కారణంగా భయపడుతున్న ఊరి ప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
చేతబడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా విజయం సాధించాయి కూడా. అయితే ఈ మధ్య కాలంతో ఈ తరహా చిత్రాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య ‘మసూద’ వచ్చి మంచి విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘విరూపాక్ష’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కథను చక్కగా అల్లుకున్నాడు కార్తిక్ దండు. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రేమ కథను చొప్పించి కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు అడ్డంకిగా అనిపిస్తుంది.
పాడుబడ్డ ఇంట్లో క్షుద్రపూజల సీన్‌తో సినిమా ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. పుష్కరకాలం తర్వాత ఏం జరుగుతుందో చనిపోతున్న జంటతో ముందే చెప్పించారు. చేతబడి కారణంగానే ప్రజలు చనిపోతున్నారనేది ప్రేక్షకులు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ చేతబడి వెనుక ఉంది ఎవరు? ఎలా చేస్తున్నారు? అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపిస్తూ సస్పెన్స్‌ని మెంటైన్ చేయడంలో సుకుమార్ వందశాతం విజయం సాధించారు. కొన్ని సన్నివేశాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. అదేసమయంలో లవ్‌స్టోరీ, లాజిక్‌లెస్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్‌కి ముందు వచ్చే సీక్వెన్స్‌లను మరింత క్లారిటీగా చూపిస్తే బాగుండేది. కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా సింపుల్‌గా ముగించారు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ‘విరూపాక్ష’ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే...
యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటించిన తొలి చిత్రమిది.హీరోయిజానికి అంతగా స్కోప్‌లేదు.అయినా కూడా తేజ్ తన పాత్రకి న్యాయం చేశాడు. సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే.. నటనలోనూ మెచ్యూర్డ్‌గా కనిపించాడు. ఇక నందినిగా సంయుక్త మీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సునీల్ పాత్రని కథలో అనవసరంగా ఇరికించారనిపిస్తుంది. ఇక సర్పంచ్ హరిశ్చంద్రగా రాజీవ్ కనకాల, పూజారిగా సాయిచంద్, అఘోరాగా అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. శామ్ దత్ సైనూద్ధీన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. రొటీన్ కథకు సుకుమార్ స్క్రీన్‌ప్లే బాగా ప్లస్ అయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
- అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment