టైటిల్:యాత్ర 2
నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్,సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్ తదితరులు
నిర్మాణ సంస్థ: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్
నిర్మాత: శివ మేక
రచన-దర్శకత్వం: మహి వి. రాఘవ్
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ:మది
విడుదల తేది: ఫిబ్రవరి 8, 2024
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం (2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే..
యాత్ర 2 ఈవెంట్ బేస్డ్ బయోపిక్. వైఎస్సార్ మరణం అనంతరం, ఆయన తనయుడు, వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’ కథ. వైఎస్సార్ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు.. వాటన్నింటిని ఎదుర్కొన్ని వైఎస్ జగన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే..
ఇది వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల కథ కాదు..వారి వ్యక్తిత్వానికి సంబంధించిన స్టోరీ. వైఎస్సార్ రాజకీయం ఎలా ఉంటుంది? ఆయనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎలాంటి భరోసా ఇస్తారు? అనేది ‘యాత్ర’లో చూపించిన మహి వి రాఘవ్.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన పడిన కష్టాలేంటి? అదిష్టానం వద్దని చెప్పినా..తనను నమ్ముకున్న ప్రజల కోసం అండగా ఉండేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర.. వైఎస్సార్‌సీపీ పార్టీ స్థాపించడానికి గల కారణం.. ప్రత్యర్థులంతా ఒక్కటైనా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? అనేది యాత్ర 2లో చూపించాడు.
వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆ యాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించాడు డైరెక్టర్ మహి. ఎమోషన్స్ ఎంత పండించాలి? ఎలాంటి సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనేది లెక్కలేసుకొని మరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు మహి. రెగ్యులర్ బయోపిక్‌లా కేవలం కథను మాత్రమే చెప్పకుండా.. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్‌గా చూపిస్తూ ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశాడు. 2009 నుంచి 2014 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి.
2009 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ ప్రకటించే సన్నివేశంలో ‘యాత్ర 2’కథ ప్రారంభం అవుతుంది. రెండోసారి వైఎస్సార్ సీఎం అవ్వడం.. రచ్చబండ కోసం వెళ్తూ మరణించండం కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రజల కోసం జగన్ అదిష్టానాన్ని ఎదిరించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సెకండాఫ్ అంతా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్ చెప్పే మాటలు అందరిని ఆకట్టుకుంటాయి.
అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా..జగన్ ధైర్యంతో పార్టీని నడిపించడం.. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం.. తప్పుడు కేసులు పెట్టిన నందిగాం సురేశ్‌ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం..ఇవ్వన్నీ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి.
ఇక ఈ సినిమాలోని ప్రతి డైలాగు.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. వైఎస్ జగన్ ఎలాంటి వాడో డైలాగ్స్‌లతోనే తెలియజేశాడు మహి వి.రాఘవ్.
‘జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో జగన్ వ్యక్తితం ఎలాంటిదో తెలియజేశాడు.
‘ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’ అనే మాటల్లో జగన్ విశ్వసనీయత ఎంతటిదో అర్థమవుతుంది.
'నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు.. జగన్‌పై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది తెలియజేస్తుంది.
‘నేను విన్నాను-నేను ఉన్నాను' అంటూ జగన్ చెప్పే మాటలు ప్రజలకు ఆయనిచ్చిన భరోసాని తెలియజేస్తుంది.
'నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని'అంటూ అసెంబ్లీ వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్ ధైర్యం ఎలాంటిదో అర్థమతుంది.
చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’ అనే మాటలు.. జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తుంది.
‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే...పులిని బోనులో పెట్టినా అది పులే’అంటూ వైఎస్ జగన్ గురించి ఓ సీనియర్ నేత చెప్పే డైలాగ్‌కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో కథంతా వైఎస్సార్, వైఎస్ జగన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించేశాడు. ఇక వైఎస్ జగన్‌గా జీవా అదరగొట్టేశాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్‌నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు జీవా. వైఎస్ జగన్ హుందాతనం, రాజకీయం, తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెరపై అద్భుతంగా పండించాడు.
వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై అచ్చం వైఎస్ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె సోనియా గాంధీని గుర్తు చేశారు.చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాకేంతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ‘చూడు నాన్న..’పాటు హృదయాలను హత్తుకుంటుంది. పెంచలదాస్ పాడిన వైఎస్సార్ పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తుంది. ‘తొలి సమరం’సాంగ్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో జోష్‌ని నింపుతుంది. మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా.. ‘ఓ రాజకీయ నాయుకుడి జీవితంలో డ్రామా ఉండవచ్చు.. యాక‌్షన్‌కూ అవకాశముంది.. బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందన్న వాళ్లను చూస్తే కామిడీకి స్కోపు ఉందని అనుకోవచ్చు. కానీ.. ఎమోషన్ కూడా ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది అనడమే కాకుండా... ఆ భావోద్వేగాలను అందంగా తెరపైకి ఎక్కించి మరీ చూపించాడు మహి వి.రాఘవ్.
-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment