నిమ్న వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీవీ నటి యువికా చౌదరి మీద కేసు నమోదైంది. దళితులను చులకన చేస్తూ ఆమె మాట్లాడిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సామాజిక కార్యకర్త రాజత్ కల్సన్ సదరు నటిపై చర్యలు తీసుకోవాలంటూ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువికా షెడ్యూల్డ్ కులాల మీద అవమానకరమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మే 26న అందిన ఈ ఫిర్యాదు మేరకు నటి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు శనివారం నాడు మీడియాకు వెల్లడించారు.
కాగా బిగ్‌బాస్ నటి యువికా మే 25న ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇందులో షెడ్యూల్డ్ కుల వర్గాలను కించపరిచేలా మాట్లాడింది. దీంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడమే కాక ఏకంగా యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సదరు నటి తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరింది. తను మాట్లాడినదానికి సరైన అర్థం కూడా తెలియదని, అందువల్లే ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇదిలా వుంటే ఇటీవలే నిమ్న కులాల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బుల్లితెర నటి మున్మున్ దత్తా మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment