కుష్ఠు రహిత జిల్లాగా మార్చుకుందాం..
ములుగు: ములుగును కుష్ఠు రహిత జిల్లాగా మార్చుకోవడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు సూచించారు. ఈ మేరకు కుష్ఠు వ్యాధి(లెప్రసీ) నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం కుష్ఠు నిర్మూలన అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైద్యసిబ్బంది భారీగా హాజరై జాతీయ రహదారి జంక్షన్ వద్ద కుష్ఠు నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి వంశపారపర్యంగా వచ్చేది కాదని తెలిపారు. మైక్రో బ్యాక్టీరియా వల్ల కుష్ఠువ్యాధి సోకుతుందన్నారు. మల్టీడ్రగ్ తెరపి ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. అనంతరం ప్రోగ్రాం అధికారి చంద్రకాంత్ మాట్లాడుతూ పీహెచ్‌సీల వారీగా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకొని గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆశ కార్యకర్తలు వచ్చే నెల 13వ తేదీ వరకు ఇంటింటా సర్వే చేసి అనుమానితులను గుర్తించి సమీపంలోని పీహెచ్‌సీలకు రెఫర్ చేయాలని ఆదేశించారు. బాధితులకు నెలవారీగా మందులు అందించి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యులు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించని అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన వైదసేవలతో పాటు సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి సంపత్, డీపీఎంఓ సాంబయ్య, సంజీవరావు, సూపర్‌వైజర్లు దేవేందర్, నిర్మల మేరి, దేవమ్మ, కమల, పుష్పకుమారి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment