వీధి కుక్కల నియంత్రణకు చర్యలు
నాగర్‌కర్నూల్: వీధి కుక్కలతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో పట్టణప్రగతి నిధులు రూ. 60 లక్షలతో నిర్మించిన ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్‌ను బుధవారం ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. వీధి కుక్కల సంఖ్య నియంత్రణతో పాటు వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. స్టెరిలైజేషన్ ప్రక్రియ ద్వారా కుక్కల సంఖ్యను నియంత్రించి.. వీటి వల్ల ప్రజలకు కలిగే సమస్యలను తగ్గిస్తామన్నారు. ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్‌లో అందించే వైద్యసేవల్లో భాగంగా వీధి కుక్కలను పట్టుకుని జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడంతో పాటు రాబిస్, పార్వో వైరస్, డిస్టెంపర్ వంటి వ్యాధుల నిరోధక టీకాలు వేయనున్నట్లు తెలిపారు. వాటికి స్టెరిలైజేషన్ అనంతరం తిరిగి సహజ జీవావరణంలో వదిలే విధానాన్ని అమలుచేస్తారన్నారు. ఆపరేషన్ పూర్తయిన కుక్కలు పూర్తి ఆరోగ్యంగా మారిన తర్వాతే తిరిగి వాటి ప్రాంతాల్లో వదిలేస్తారని.. ప్రజలకు వీధి కుక్కల ప్రవర్తన, సంరక్షణ, వీటి జనన నియంత్రణ అవసరాన్ని వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు.
● ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వీధి కుక్కల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వీధి కుక్కల పెరుగుదల నియంత్రణతో పాటు వాటి ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అందులో భాగంగా ఎనిమల్ బర్త్ కేర్ సెంటర్ ప్రారంభించినట్లు చెప్పారు.స్థానిక సంస్థల సహకారంతో శునకాల సంరక్షణ, జనన నియంత్రణ కోసం మరిన్ని నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జీవీ రమేష్, మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment