గురుకులాల్లో రాత్రి బస చేయాలి
నాగర్‌కర్నూల్: గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు, పౌష్టికాహార ప్రమాణాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఇందుకోసం ప్రత్యేకాధికారులు నెలలో ఒకరోజు రాత్రి బస చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించి, సిలబస్ ఎంత వరకు పూర్తయిందో తెలుసుకొని మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలల ప్రత్యేకాధికారులతో క్షేత్రస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలపై అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని, క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానాన్ని పరిశీలించేందుకు సంబంధిత ప్రత్యేకాధికారులు రాత్రి బస చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఆరోగ్యం, పరిసరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, నూనె వంటి సరుకుల నాణ్యత, వాటి కాలపరిమితిని జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు. కిచెన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వంట పాత్రలను శుభ్రంగా కడగాలని, పాడైన గుడ్లు, కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదన్నారు. గురుకుల పాఠశాలలోని స్టోర్, వంటశాలలు పూర్తిగా పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అధికారి ఆశ్రమ పాఠశాలను దత్తత తీసుకుని, విద్యాసంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని ఏ హాస్టల్‌లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment