సహకార సంఘాల్లో సంస్కరణలు
అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం సహకార వ్యవస్థలో రైతు ఉత్పత్తి కేంద్రాల పేరిట సంస్కరణలపై దృష్టిసారించింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను బలోపేతం చేయాలని భావిస్తోంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ పథకంలో రాష్ట్రంలోని 247 పీఏసీఎస్‌లను ఎంపిక చేయగా.. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలోని 13 పీఏసీఎస్‌లకు అందులో స్థానం కల్పించారు.
ఏం చేస్తారు అంటే..
ఎంపికై న పీఎసీఎస్‌లోని సభ్యులు కలిసి రూ.15 లక్షలు తగ్గకుండా పెట్టుబడి పెడితే కేంద్రం వాటాగా రూ.15 లక్షలు పెట్టుబడి సాయం ఇస్తుంది. మౌళిక వసతుల కల్పనకు మూడు విడతల్లో మరో రూ.18 లక్షలు చెల్లిస్తోంది. మౌలిక వసతుల కోసం కేటాయించే సాయంతో సంబంధం లేకుండా మిగిలిన రూ.30 లక్షలతో సభ్యులే నేరుగా రైతు ఉత్పత్తులను సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ నాన్ క్రెడిట్ పద్ధతిలో వ్యాపారం చేయాల్సి ఉంది. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, ఇతర పని సామగ్రిని విక్రయించడం, చేతికొచ్చే ఉత్పత్తులను కొనుగోలు చేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో అప్పులు తీసుకోవడం, ఇవ్వడమనేది ఉండదు. వచ్చే లాభాలను పీఏసీఓఎస్‌లోని సాధారణ ఖాతాలలో కాకుండా ప్రత్యేకమైన ఖాతాలో జమ చేస్తూ పెట్టుబడి పెట్టిన సభ్యులే పంచుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడికి ముందుకు రాని రైతులు ఎప్పటి మాదిరిగానే సాధారణ సభ్యులుగా ఉంటారు.
కమిటీ పర్యవేక్షణ..
ఈ పద్ధతి ద్వారా వ్యవసాయానికి అసవరమైన సామగ్రి కొనుగోలు, దిగుబడి వచ్చిన ఉత్పత్తుల విక్రయాల కోసం రైతులు ఏటూ వెళ్లాల్సిన అవసరం రాదు. క్రయవిక్రయాల వ్యాపారమంతా పీఏసీఎస్ పరిధిలోనే జరుగుతుంది. ఇది సత్ఫలితాలిస్తే జిల్లాలో మొత్తం 23 పీఏసీఎస్‌లలో అమలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్, జెడ్పీసీఈఓ, జిల్లా సహకార, పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ శాఖాధికారులు సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణ చేస్తుంది.
ఎంపిక చేసిన సొసైటీలు ఇవే..
జిల్లాలోని 13 ప్రాథమిక సహకార సంఘాలు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికయ్యాయి. ఇందులో అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, బల్మూర్ మండలం కొండనాగుల, అమ్రాబాద్, అంబటిపల్లి, చారకొండ, రంగాపూర్, కల్వకుర్తి, తిమ్మాజిపేట, బిజినేపల్లి, తాడూరు, గొరిట, కొల్లాపూర్, పెంట్లవెల్లి సొసైటీలు ఎంపికయ్యాయి.
పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని
13 పీఏసీఎస్‌ల ఎంపిక
వ్యాపారంతో లబ్ధి..
ఇది ప్రయోగాత్మక పథకం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా సహకార శాఖ ఏర్పాటు చేసింది. సహకార శాఖ ద్వారా నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పథకం అమలైతే అంతా నాన్ క్రెడిట్ పద్ధతిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. అప్పులకు ఆస్కారం ఉండదు. పీఏసీఎస్‌లో రెండు ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటా చెల్లించిన సభ్యులకే వ్యాపారంలో లబ్ధి చేకూరుతుంది.
– రఘనాథరావు, జిల్లా సహకార శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment