‘ఉమామహేశ్వర’ సర్వేను అడ్డుకున్న రైతులు
అచ్చంపేట రూరల్: మండలంలోని గుంపన్పల్లి, అచ్చంపేట శివారులో ఉమామహేశ్వర రిజర్వాయర్ కాల్వ సర్వే పనులను బుధవారం అధికారులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కొందరు రైతులు సర్వే పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రిజర్వాయర్ నిర్మాణంతో తమ జీవనాధారమైన భూములను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు దిగారు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సర్వేను అడ్డుకుంటే చర్యలుంటాయని.. సహకరించాలని పోలీసులు కోరినా రైతులు వినలేదు. దీంతో రైతులను బలవంతంగా డీసీఎంలో ఎక్కించి ఉప్పునుంతల స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉంటే, తమ సమస్యలను వినకుండానే సర్వే చేయడం ఏంటని పలువురు రైతులు ప్రశ్నించారు. భూములు కోల్పోయే వారంతా నిరుపేదలేనని.. వ్యవసాయమే తమ జీవనాధారమన్నారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు బలవంతంగా తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. కాగా, పోలీసు బందోబస్తు మధ్య సర్వే పనులు కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment