అరుణాచలానికి ప్రత్యేక బస్సు
నాగర్‌కర్నూల్ క్రైం: ఫిబ్రవరి 12న పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచలంలో గిరిప్రదర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ డీఎం యాదయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 10న సాయంత్రం 8గంటలకు నాగర్‌కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరుతుందని పేర్కొన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ సందర్శన, అరుణాచలంలో గిరిప్రదర్శన అనంతరం 13వ తేదీన తిరిగి జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.3,600, చిన్నారులకు రూ.2,400 బస్సు చార్జీలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94904 11590 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
గోల్డ్ మెడల్
నాగర్‌కర్నూల్ క్రైం: కరీంనగర్లో నిర్వహిస్తున్న తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో బల్మూర్ మండలం రామాజీపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ దేశెట్టి శివ అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. 1500 మీటర్ల పరుగు పందెంలో ఆయన గోల్డ్ మెడల్ సాధించడంతో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందనలు తెలిపారు. జిల్లా పోలీసు సిబ్బంది మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,329
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 300 మంది రైతులు 3,255 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకువచ్చారు. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,329, కనిష్టంగా రూ.4,001, సరాసరి రూ.5,502 ధరలు వచ్చాయి. మరో ఇద్దరు రైతులు ఐదు క్వింటాళ్ల కందులను తీసుకురాగా.. గరిష్టంగా రూ.6,579, కనిష్టంగా రూ.6,407 ధర పలికింది.
రైతులకు మెరుగైన సేవలు
కల్వకుర్తి రూరల్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్‌శాఖ ఇన్చార్జి అధికారి సరబ్ సింగ్ అన్నారు. గురువారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి.. వేరుశనగ ధరలపై ట్రేడర్లు, వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం మార్కెట్లో అమ్మకానికి వచ్చిన వేరుశనగను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో వేరుశనగకు మద్దతు ధర లభించడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. ఇతర మార్కెట్లతో పోలిస్తే జిల్లాలోనే వేరుశనగకు అధిక ధరలు లభిస్తున్నట్లు తెలిపారు. గతేడాది అత్యధికంగా రూ. 10వేల ధర వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కల్వకుర్తి ప్రాంతంలో పండించే పంటకు అధిక డిమాండ్ ఉందన్నారు. అయితే ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. ఆయన వెంట మార్కెట్ కార్యదర్శి భగవంతు, సిబ్బంది ఉన్నారు.
ప్రజా పోరాటాలకు పునాది
తిమ్మాజిపేట: ప్రజా పోరాటాలకు పునాది వేసిన పార్టీ సీపీఐ అని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం మండలంలోని మారేపల్లిలో గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై గళమెత్తి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఖాజా మైనొద్దీన్, జిల్లా కార్యదర్శి శివశంకర్, ఉపాధ్యక్షుడు శివకృష్ణ, నాయకులు బాలస్వామి, ఆంజనేయులు, రాములు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment