
‘ఎల్‌ఆర్‌ఎస్’కు సర్వర్ డౌన్
సాఫీగానే కొనసాగిస్తున్నాం..
నెట్ సమస్య వచ్చినా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ సాఫీగానే కొనసాగిస్తున్నాం. కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారుల స్టేటస్ చూసి అప్‌లోడ్ చేస్తున్నాం. తప్పులు ఉన్నవారివి కూడా సరిచేస్తున్నాం.
– కృష్ణవేణి, అసిస్టెంట్ సిటీప్లానర్, నల్లగొండ
ఫ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియలో అవాంతరాలు
ఫ ఒక్కో దరఖాస్తుకు గంటకుపైనే సమయం
ఫ నీలగిరిలో దరఖాస్తుదారుల నిరీక్షణ
ఫ తప్పుల సవరణలోనూ సిబ్బందికి
ఇబ్బందులు
నల్లగొండ టూటౌన్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) క్రమబద్ధీకరణ ప్రక్రియకు సర్వర్ల సతాయింపుతో తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25 శాతం ఫీజు రాయితీ గడువు ఈనెల 31వ తేదీ వరకే ఉంది. దీంతో ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్లాట్ల యజమానులు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు అధిక సంఖ్యలో నీలగిరి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ సక్రమంగా పనిచేయడం లేదు. ఫలితంగా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు, దరఖాస్తుదారులకు తలనొప్పిగా మారింది. గంట సమయంలో కూడా ఒక్క దరఖాస్తుదారుడి ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు అప్‌లోడ్ కాకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వర్ రాకపోవడంతో ఆశించిన స్థాయిలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి కార్యాలయంలో వేచి చూడలేక వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
తప్పులు సరిచేసేందుకూ నానా పాట్లు
గత ఐదేళ్ల క్రితం ఎల్‌ఆర్‌ఎస్ కోసం రూ.వెయ్యి ఫీజు చెల్లించిన ప్లాట్ల యజమానులు కొందరు ప్రైవేట్ నెట్ సెంటర్లలో దరఖాస్తులు చేసుకున్నారు. అప్పట్లో నెట్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తుదారుల పేర్లు, ఇంటి పేర్లు, ప్లాట్ల విస్తీర్ణం తప్పుగా నమోదు చేసినవి చాలానే ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తప్పులు సరిచేయడానికి మున్సిపల్ అధికారులకు ఎడిట్ ఆప్షన్ సౌకర్యం కల్పించింది. తప్పులు సరిచేయడానికి కూడా సర్వర్లు సరిగా రాకపోవడంతో నానా పాట్లు పడాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు చెల్లించనివారు అధిక సంఖ్యలో..
నీలగిరి పట్టణంలో 36,129 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 28వేల వరకు దరఖాస్తులకు అనుమతి లభించింది. వీరిలో కేవలం 1,831 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. మిగతా వారు ఫీజు చెల్లించడానికి ఆసక్తి చూపడంలేదు. అసంపూర్తి పత్రాలు, గ్రీన్ బెల్ట్ ప్రాంతాలు, ఇండస్ట్రీస్ ప్రాంతాల నుంచి వచ్చిన 8,400 దరఖాస్తులను పక్కన పెట్టారు. మిగతా దరఖాస్తుదారుల ప్రక్రియ కొనసాగుతుంది. సర్వర్లు, దరఖాస్తు చేసిన సమయంలో దొర్లిన తప్పుల కారణంగా ఈనెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదనే చెప్పాలి.
నీలగిరిలో ఎల్‌ఆర్‌ఎస్ వివరాలు
వచ్చిన దరఖాస్తులు 36,129
అనుమతించినవి 28,000
ఫీజు చెల్లించినవారు 1,831