
లక్ష మందిని తరలించాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించాలని పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సభకు జన సమీకరణకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులతో శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ సమావేశం నిర్వహించి నియోజవకర్గాల వారీగా టార్గెట్ విధించారు. వరంగల్‌కు 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల నుంచి లక్షల మందిని తరలించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచే టార్గెట్‌లో సగం మంది వచ్చేలా చూడాలని సూచించినట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి ఆరేడు వేల మంది చొప్పున ప్రజలు వరంగల్ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, విద్యుత్, సాగునీటి విషయంలో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఫలితం లేదని, సూర్యాపేటతో పాటు నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని బీఆర్‌ఎస్ అందిపుచ్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. స్థానికంగా పరిస్థితులను బట్టి స్థానిక సమస్యలపై, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కన్నీరుపెడుతున్నారని, ఇప్పుడు ప్రజల కన్నీరు తుడిచే బాధ్యత గులాబీ జెండాదేనని ఆ దిశగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం
ఫ వరంగల్ సభకు జనసమీకరణపై ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం
ఫ కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉందన్న గులాబీ అధినేత
ఫ ప్రజలు మనవైపు ఉన్నారు.. స్థానికంగా పోరాటాలు చేయాలని పిలుపు