మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట | - | Sakshi
Sakshi News home page

మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట

Published Thu, Jan 30 2025 1:46 AM | Last Updated on Thu, Jan 30 2025 1:46 AM

మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట

మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట

కల్లూరు: ఓట్లు, అధికారం కోసం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట అని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం కాటసాని తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు నమ్మించారన్నారు. నేటికీ ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చేటప్పుడు బాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే చంద్రబాబు రూ. 1.19 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారన్నారు. అంత డబ్బుతో రాష్ట్రంలో ఎక్కడ సంపద సృష్టించారో? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్న ఘనత బాబుదన్నారు. వలంటీర్లు, బెవరేజెస్‌ కార్పొరేషన్‌, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌, ఏపీఎండీసీ, కొన్ని చోట్ల ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తీసేశారని, ఇప్పుడు గ్రామ/వార్డు సచివాలయాల్లో హేతుబద్ధీకణ పేరుతో ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టినట్టేనని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన మాటలు నేడు నిజమయ్యాయన్నారు.

నాడు ఆరోగ్య రంగంలో

విప్లవాత్మక మార్పు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లామని కాటసాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని చెప్పారు. మెడికల్‌ కళాశాల నిర్మాణం పూర్తయితే ఎంతో మంది పేద విద్యార్థులు డాక్టర్‌ విద్య అభ్యసించే అవకాశం వచ్చేదన్నారు. ఇసుక, మద్యం, క్వార్జ్‌, ఫ్లైయాష్‌ దేని వదలకుండా కూటమి నేతలు దోచుకుంటున్నాని విమర్శించారు. నియోజకవర్గాల్లో ప్రతి పనికి ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. సంపద సృష్టి అధికారపార్టీ వాళ్లకు తప్ప ఎవ్వరికి జరగడం లేదన్నారు. పాణ్యం నియోజకవర్గంలో వాటాల కోసం కూట మి నేతలు కొట్టుకున్న సంఘటనలున్నాయన్నారు.

రీ సర్వేపై దుష్ప్రచారం

ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీ భూములను లాక్కుంటున్నారని రీసర్వేపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఆ సర్వేను పునఃప్రారంభించారన్నారు. ఇలా ప్రతి విషయంలో ఎన్నికల ముందు ఒకమాట అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం బాబు నైజమన్నారు. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని విమర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మీరెడ్డి, పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు హనుమంతురెడ్డి, భీమేశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, గోపాల్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, తిరుపాల్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఓట్ల కోసం సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు

అధికారంలోకి వచ్చాక హామీలు లేవు..

అభివృద్ధి లేదు

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజం

ప్రజల తరఫున హామీల అమలుకు

పోరాటం చేస్తామని వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement